ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో గుంటూరు ఒకటి. గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, దాచేపల్లి ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. అధికారులు లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలు కూడా లాక్డౌన్ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కరోనా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ఎవరూ తమ గ్రామాల్లో రాకుండా చర్యలు చేపడుతున్నారు.
ముళ్ల కంచెలు, దుంగలు..
గ్రామాల సరిహద్దుల వద్ద ముళ్ల కంచెలు, దుంగలు, పెద్దపెద్ద బండరాళ్లు అడ్డు వేస్తున్నారు. వైరస్ను నియంత్రించే క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన లాక్డౌన్ అమలు చేయాలనే ఉద్దేశం మంచిదే. అదే సమయంలో ఆయా గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైనా... గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినా... అంబులెన్సులు రావటానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.
మార్చి 27న దుగ్గిరాలలో ఓ వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుంటే అంబులెన్సు రెండు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. పెద్దపెద్ద తాటిచెట్లను తొలగించటానికి సిబ్బందికి వీలు పడలేదు. దీంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆటోలో అంబులెన్సు వద్దకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఏప్రిల్ 25న అర్థరాత్రి సమయంలో యడ్లపాడు మండలం పుట్టకోటలో ఓ మహిళకు పురిటి నొప్పులు మొదలై అంబులెన్సు కోసం ఫోన్ చేశారు. అప్పుడు కూడా ముళ్ల కంచెల కారణంగా అంబులెన్స్ గ్రామంలోకి రాలేకపోయింది. సమయానికి గ్రామంలో ఉన్న ఏ.ఎన్.ఎం ఆ మహిళకు పురుడు పోసింది. ఆ తర్వాత ఆటోలో అంబులెన్సు వద్దకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కాన్పు కష్టంగా మారితే ఆ మహిళ పరిస్థితి ఏంటనేది ఊహించేందుకే భయపడే పరిస్థితి.