హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ కమిషనర్లు తనిఖీ కేంద్రాలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. జోన్ల వారీగా ఉన్నతాధకారులకు బాధ్యతలు అప్పగించారు. అత్యవసర పని మీద, ఆస్పత్రులకు వెళ్లే వాళ్లకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అకారణంగా రోడ్ల మీదకు వచ్చే వాళ్లపై లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్.. పకడ్బందీగా అమలు
హైదరాబాద్‌లో లాక్ డౌన్‌ను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీపీ అంజనీ కుమార్ ఐదు జోన్లకు పోలీసు ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు. అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
అవగాహన కల్పిస్తున్న పోలీసులు
రవీంద్ర భారతి, ఎంజే మార్కెట్, మదీనా వద్ద తనిఖీ కేంద్రాలను సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. చార్మినార్ వద్దకు చేరుకొని పాతబస్తీలో లాక్ డౌన్ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సైబర్ టవర్స్ వద్ద తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్లలో పర్యటించి లాక్ డౌన్ పటిష్ఠంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.