తెలంగాణ

telangana

ETV Bharat / state

లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత

తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన 40 వేల మందికిపైగా అభ్యర్థులపై అనర్హత వేటుపడింది. ఎన్నికల వ్యయ వివరాలు అందజేయని ఫలితంగా వేటుకు గురయ్యారు. వీరిలో గెలిచిన వారు పదవులు కోల్పోతుండగా, ఓడిన వారు మూడేళ్లపాటు అనర్హతతో ఎన్నికలకు దూరం కానున్నారు.

లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత
లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత

By

Published : Jan 6, 2021, 6:55 AM IST

Updated : Jan 6, 2021, 7:12 AM IST

ఎన్నికల్లో పోటీ చేయగానే బాధ్యత తీరిపోదు. ఎన్నికల ఖర్చుల తాలూకూ లెక్కలు చెబితేనే ఆ ప్రక్రియ ముగిసినట్లు. ఆ... ఏముందిలే! ఎవరొచ్చి అడుగుతారులే! అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అలాంటి భావనతో ఎన్నికల వ్యయ వివరాలు అందజేయని ఫలితంగా తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన 40 వేల మందికిపైగా అభ్యర్థులపై అనర్హత వేటుపడింది. వీరిలో గెలిచిన వారు పదవులు కోల్పోతుండగా, ఓడిన వారు మూడేళ్లపాటు అనర్హతతో ఎన్నికలకు దూరం కానున్నారు.

లెక్క చెప్పని నాయకులు

రాష్ట్రంలో 2018లో గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థులుగా 36,501 మంది, వార్డు సభ్యులుగా 2,30,856 మంది, ఎంపీటీసీలుగా 19,095మంది, జడ్పీటీసీలుగా 2,429 మంది పోటీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి నాలుగు లక్షల రూపాయలు. కనిష్ఠ వ్యయ పరిమితి రూ.30 వేలు.

ఈ వ్యయాల తాలూకూ వివరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల్లో ఎన్నికల అధికారికి అందజేయాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది. అందుకు భిన్నంగా పోటీ చేసిన వారిలో సుమారు 40 వేల మందిపైగా నిర్దేశించిన గడువులోపు వ్యయాల తాలూకూ వివరాలను సమర్పించలేదు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు శ్రీకారం చుట్టారు.

నేరుగా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ)కు ఉత్తర్వులు పంపడం ద్వారా చర్యలు చేపడుతున్నారు. అలా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులపై అనర్హత వేటు వేశారు. మరికొందరికి ఆ దిశగా అనర్హత నోటీసులు జారీ చేశారు.

అనర్హులైన స్థానాల్లో మళ్లీ ఎన్నికలే!

వ్యయాల వివరాలు ఇవ్వని పక్షంలో గెలిచిన వారు సంబంధిత పదవిని కోల్పోవడం, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులవుతారు. ఓడినవారు నోటిఫికేషన్‌ జారీ అయినప్పటి నుంచి మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. ఈ కారణంగా అనర్హులయి, పదవి కోల్పోయిన వారి స్థానాలపై ఎన్నికల సంఘం గెజిట్‌ ప్రచురించి, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంది.

వార్డు సభ్యులందరూ అనర్హులే

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలో జియాపల్లి, జియాపల్లి తాండాలు రెండు గ్రామ పంచాయతీలు. ఈ రెండు పంచాయతీల్లోని వార్డు సభ్యులు అందరూ ఎన్నికల లెక్కలు సమర్పించని కారణంగా పదవులు కోల్పోయారు. ఫలితంగా ఈ రెండు పంచాయతీలలో ప్రస్తుతం సర్పంచులు మాత్రమే మిగిలారు. వార్డు పదవులకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక్కడే కాదు రాష్ట్రంలోని అనేక పంచాయతీలలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.

ఇవీ చూడండి:ఉన్మాది ఘాతుకం.. మహిళపై పెట్రోలు పోసి నిప్పు

Last Updated : Jan 6, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details