తెలంగాణ

telangana

ETV Bharat / state

మినీ పోల్స్​: సీఎం సహా నేతలంతా నియమావళిని పాటించాల్సిందే! - telangana sec letter to cm

మినీ పురపోరుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తి స్థాయిలో పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఎస్​ఈసీ ప్రత్యేకంగా లేఖలు రాసింది. ఎన్నికలు జరుగుతున్న పట్టణప్రాంతాలకు ఐఏఎస్ అధికారులకు పరిశీలకులుగా నియమించింది. జనసేన సహా మరికొన్ని పార్టీలు ఈ ఎన్నికలకు ఉమ్మడి గుర్తును కోల్పోయాయి.

MINI POLLS
మినీ పోల్స్

By

Published : Apr 16, 2021, 7:16 PM IST

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మరో ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పట్టణాల్లో నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జీహెచ్​ఎంసీ పరిధిలోని లింగోజిగూడ సహా మరో 8 పట్టణాల్లోని వార్డులకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఆయాచోట్ల ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ తరుణంలో నియమావళిని విధిగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమాళికి సంబంధించి గవర్నర్‌ సహా ముఖ్యమంత్రి కార్యాలయం, ఎస్​ఈసీ సమాచారం అందించింది.

పక్కాగా అమలు

ఎన్నికలతో సంబంధం ఉన్న, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయరాదని ఎస్​ఈసీ తెలిపింది. ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నేతలు సహా అధికారులు, అన్ని శాఖలకు ప్రవర్తనా నియమావళి అమలు విషయాన్ని తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపింది. ఇదే సమయంలో ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా నియమావళిని పక్కాగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది.

ఎస్​ఈసీ లేఖలు

ఈ మేరకు సీఎస్, డీజీపీ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కలెక్టర్లు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలకు ఎస్​ఈసీ లేఖలు రాసింది. పురపోరుకు ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్​కు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా, ఖమ్మం కార్పోరేషన్​కు మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్ నదీం పరిశీలకులుగా ఉంటారు. అచ్చంపేట మున్సిపాలిటీకి గెజెటీర్స్ కమిషనర్ కిషన్, సిద్దిపేట మున్సిపాలిటీకి ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీదేవి, నకిరేకల్ మున్సిపాలిటీకి ప్రజారోగ్య, ఆరోగ్యసంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ పరిశీలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు గిరిజనసంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీధర్ పరిశీలకునిగా ఉంటారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖల కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, సుదర్శన్ రెడ్డిని పరిశీలకులుగా రిజర్వ్ లో ఉంచారు. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లకు ఇద్దరు చొప్పున, మున్సిపాల్టీలకు ఒకరు చొప్పున ఆడిట్ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించారు.

గుర్తును కోల్పోయిన పార్టీలు

మినీపురపోరుకు జనసేన పార్టీ ఉమ్మడి గుర్తును కోల్పోయింది. పురపాలక సాధారణ ఎన్నికల్లో కనీసం 10శాతం సీట్లలో పోటీ చేయనందుకు ఉమ్మడి గుర్తును రద్దు చేస్తున్నట్లు ఎస్​ఈసీ తెలిపింది. భాజపాతో పొత్తు కారణంగా గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్న జనసేన... వరంగల్, ఖమ్మం సహా ఇతర మున్సిపాలిటీల్లోనూ పోటీ చేస్తామని తెలిపింది. ఈ ఎన్నికల్లో గాజుగ్లాసును తమకు ఉమ్మడి గుర్తు కొనసాగించాలని కోరింది. ఐతే జనసేన వివరణతో సంతృప్తి చెందని కమిషన్.... ఉమ్మడి గుర్తును తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జనసేన పార్టీతో పాటు ఇండియన్ ప్రజా కాంగ్రెస్, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, హిందూస్తాన్ జనతా పార్టీ, ప్రజాబంధు పార్టీలు ఉమ్మడి గుర్తును కోల్పోయాయి.

ABOUT THE AUTHOR

...view details