తెలంగాణ

telangana

ETV Bharat / state

దా'రుణ' యాప్​ల బెదిరింపులు.. మళ్లీ మొదలు! - loan app case latest news

‘మీరు అప్పు తీసుకుని వడ్డీ కట్టలేదు. అసలు కూడా చెల్లించలేదు. జ్ఞానం ఉందా’ అంటూ అసభ్యకర తిట్లదండకం మళ్లీ మొదలైంది. యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నవారికి నాలుగైదు రోజుల నుంచి వరుసగా ఫోన్లు వస్తున్నాయి.

loan app case issue in hyderabad
బెదిరింపులు.. మళ్లీ మొదలు!

By

Published : Mar 28, 2021, 9:09 AM IST

చైనా కంపెనీల నిర్వాహకులు, కాల్‌సెంటర్ల ప్రతినిధులను సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో ఉంచినా.. మళ్లీ ఫోన్లు వస్తుండటంతో అప్పు తీసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. వాట్సాప్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఫోటోలు పంపడం వంటివి చేస్తారేమోనని భయపడుతున్నారు. మరోవైపు.. యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని చిత్రహింసలు ఎదుర్కొంటున్నవారు ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని, తమకు ఫిర్యాదులు చేయాలంటూ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. సులభంగా రుణాలిస్తామంటూ రూ.29 వేల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల ఆర్థిక మూలాలను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దెబ్బకొట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో చైనీయుడు ల్యాంబో, కీలక పాత్రధారి నాగరాజు సహా మొత్తం 31 మంది జైల్లోనే ఉన్నారు.

ఎవరన్నది తెలుస్తుంది..

బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే.. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఎవరన్నది గుర్తిస్తామని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. మూడు పోలీస్‌ కమిషనరేట్లలో ఇదివరకు జరిగిన ఈ తరహా నేరాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. రుణగ్రహీతలకు ఫోన్లు చేయకుండా కంపెనీల ప్రతినిధులు ఉపయోగిస్తున్న వందల సిమ్‌ కార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తమకున్న సమాచారం మేరకు చైనా కంపెనీల ప్రతినిధులు ఇలాంటివి చేయడం లేదంటున్నారు. చైనా కంపెనీల సృష్టికర్త, ప్రస్తుతం జకర్తాలో ఉంటున్న జెన్నీఫర్‌.. అక్కడి నుంచి నేరాలను కొనసాగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారా? అన్న అంశంపై స్పష్టత వస్తే రుణ గ్రహీతలకు ఎవరు ఫోన్లు చేస్తున్నారో తెలిసిపోతుందన్నారు. వాట్సాప్‌లో వస్తున్న బెదిరింపులు, ఫోన్‌ చేసినప్పుడు నిందితులు మాట్లాడిన మాటలను రికార్డ్‌ చేసి తీసుకొస్తే, కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details