Literary festival in Hyderabad: వివిధ సాహితీ, సాంస్కృతిక, ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే సాహితీ వేడుకకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని విద్యారణ్య పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, రచయితలు, కళాకారులు, దర్శకులు, చిత్రకారులు పాల్గొననున్నారు. చర్చాగోష్ఠులు, పలు రకాల ప్రదర్శనలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలెన్నో సమాంతరంగా జరగనున్నాయి.
ఆయా రంగాలపై అధ్యయనం చేసిన దేశ, విదేశీ ప్రముఖులు సుమారు 120 మందికిపైగా అతిథులుగా హాజరుకానున్నారు. 27న మధ్యాహ్నం జరిగే ప్రారంభ కార్యక్రమానికి జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా భాష, సాహిత్యం, స్వేచ్ఛ-భిన్నాభిప్రాయాలపై సదస్సు జరగనుంది. అనంతరం జరిగే చర్చాగోష్ఠిలో ప్రముఖ సినీనటి, రచయిత, పెయింటర్ దీప్తినావల్ పాల్గొంటారు.
తాజాగా ఆమె రాసిన ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్‌హుడ్-ఎ మెమొయిర్’ పుస్తకంపై చర్చ జరగనుంది. 28న ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ పాల్గొంటారు. 1998లో ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్’ పుస్తకాన్ని రాసిన సాయినాథ్, తాజాగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని గుర్తింపునకు నోచుకోని వారి గురించి ‘లాస్ట్ హీరోస్-ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం’ పేరుతో పుస్తకం వెలువరించారు. దీని గురించి చర్చాగోష్ఠి జరగనుంది.