ఎలాంటి భౌతిక దూరాన్ని పాటించకుండా మద్యం కోసం జనం ఎగబడుతుండటం వల్ల కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొవిడ్ బారిన పడి మరణించే ప్రతి వ్యక్తికీ సీఎం కేసీఆరే బాధ్యుడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆదాయ వనరుల సమీకరణపై ఉన్న ప్రత్యేక శ్రద్ధ... ప్రజల ప్రాణాలపై లేదని మండిపడ్డారు. పేద ప్రజలంటే లెక్క లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆరేళ్లుగా వైద్యులను నియమించలేదన్నారు.
'వారికి జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదట'
ఒప్పంద వైద్యులు తనను కలిశారని... జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని వారు వాపోయినట్లు భట్టి తెలిపారు. నీటిపారుదల శాఖ పూర్తిగా భ్రష్టు పట్టిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రిటైరై ఏడేళ్లు గడిచినా మురళీధర్ రావునే ఇఎన్‌సీగా కొనసాగుతున్నారన్నారు. ఆయన ద్వారానే నిధులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.