హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాది నవంబరులో ఏవిధంగా మద్యం అమ్మకాలు జరిగాయో...అంతకుమించి జరగరాదని అబ్కారీ శాఖ స్పష్టం చేసినప్పటికీ మద్య ప్రవాహం ఆగలేదు. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 50 నుంచి 60 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతుంది. కానీ ప్రస్తుతం వారం రోజులుగా 100 నుంచి 170 కోట్ల రూపాయల మేర మద్యం అమ్ముడవుతోంది. 2019 నవంబరులో 28వ తేదీ వరకు 2వేల 143 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోగా....ఈ ఏడాది అదే సమయంలో 2 వేల 405 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
1185 కోట్ల మద్యం అమ్మకాలు
బల్దియా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నవంబర్ 17 నుంచి 28 వరకు 1185 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సగటున 138 కోట్ల మద్యం తాగేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి రోజుకు సగటున 97కోట్లు, మొత్తంగా కేవలం 780కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఇందులో 40 శాతం వాటా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నట్లు గణాంకాల్లో వెల్లడవుతోంది. గత దసరా సందర్భంగా అక్టోబర్‌లో 2వేల 600కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయింది. రాష్ట్ర ఎక్సైజ్ చరిత్రలోనే ఇది రికార్డు. ఈ నెలలో ఇప్పటికే పెద్దమొత్తంలో మద్యం దుకాణాలకు చేరింది. దీంతో ఈ నెలలోనూ మద్యం అమ్మకాలు 2500కోట్లు దాటే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అంచనావేస్తోంది.
ఇదీ చదవండి:భారత్ వైపే ప్రపంచ దేశాల చూపు: గవర్నర్