తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మహమ్మారిపై దివ్వెల ప్రజ్వలన... - జ్యోతి వెలిగించిన ప్రముఖులు

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్వెలు ప్రజ్వలించాయి. కరోనా బాధితులను ఆశలతీరం వైపు నడిపించేందుకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపాలనే ప్రధాని పిలుపునకు విశేష స్పందన లభించింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎటుచూసినా దీపాల వెలుగులు విరజిమ్మాయి.

జ్యోతి వెలిగించిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్
జ్యోతి వెలిగించిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్

By

Published : Apr 6, 2020, 6:25 AM IST

చిరుదివ్వెల కాంతులతో రాష్ట్రం దేదీప్యమానంగా వెలిగింది. కరోనా వైరస్​ను తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు సంఘీభావంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై కుటుంబ సమేతంగా దివ్వెలు వెలిగించారు. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో కరోనా వైరస్‌ను ఎదుర్కొందామన్న గవర్నర్‌... దీపాలు వెలిగించడం ద్వారా శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. మనదేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించాలని గవర్నర్ అన్నారు. సమష్టి కృషితోనే అది సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం మనం వైద్యులకు కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. దేశమంతా ఒక్కటై కరోనా వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

కొవ్వొత్తి వెలిగించిన సీఎం కేసీఆర్

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ కొవ్వొత్తి వెలిగించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దీపాలు వెలిగించారు.

ఆమాత్యుల ఇళ్లల్లో ప్రజ్వలించిన జ్యోతి

బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో పలువురు మంత్రులు దీపాలు వెలిగించారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి నవీన్‌ మిత్తల్‌ కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో దివ్వెలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, తలసాని, సత్యవతి రాథోడ్‌ స్వగృహాల్లో జ్యోతి ప్రజ్వలింపజేశారు. అతి త్వరలోనే కరోనా చీకట్లు తొలగాలని అందుకే దీపాలంకరణ కార్యక్రమాన్ని చేసినట్లు స్పష్టం చేశారు. వివిధ చోట్ల పలువురు మంత్రులు దీపాలు వెలిగించారు.

కరోనాను ఎదుర్కొనేందుకు తేజస్సు

ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సిమ్లాలోని రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సతీసమేతంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో దీపాలు వెలిగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జ్యోతి వెలిగించి స్ఫూర్తి చాటారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం తెలిపారు.

ప్రజా ప్రతినిధుల సంఘీభావం...

విపత్కర పరిస్థితుల్లోనూ పని చేస్తోన్న అన్ని శాఖల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ విమర్శలు చేసిన వారికి ఐక్యతతో ప్రజలు వెలిగించిన జ్యోతులతోనైనా కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. మార్కజ్ వెళ్లిన వారు దాడులు ఆపి వైద్యానికి సహకరించాలని కోరారు. వారికి మంచి ఆరోగ్యం అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారని సంజయ్ స్పష్టం చేశారు. వివిధ పార్టీల నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించారు.

జ్యోతి వెలిగించిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్

ఇవీ చూడండి : ఇవీ చూడండి : కరోనా భూతంపై జనభారతం ఐక్య పోరాటం

ABOUT THE AUTHOR

...view details