Rains in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది.
రాగల 48 గంటలలో నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు.. ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అవకాశమున్నట్లు వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. మాల్డీవులు, కొమోరిన్ ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. దక్షిణ తూర్పు మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించారు.