Liger Movie Exhibitors Strike : దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు అగ్ర హీరోలెవరూ కాల్షీట్లు ఇవ్వొద్దని తెలంగాణ ఎగ్జిబిటర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. పూరీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందడంతో ఆ చిత్రాన్ని విడుదల చేసిన తమకు సుమారు రూ.9 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎగ్జిబిటర్లను ఆదుకుంటానని, వారికి జరిగిన నష్టాన్ని 6 నెలల్లో తీరుస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తూ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద 'లైగర్ బాధితుల సంఘం' పేరుతో రిలే నిరాహార దీక్షలకు దిగారు.
ఈ సందర్భంగా లైగర్ చిత్ర విషయంలో బాధిత ఎగ్జిబిటర్లను పూరీ జగన్నాథ్ ఆదుకొని మాట నిలబెట్టుకోవాలని కోరారు. అంతవరకు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ సహా ఇతర అగ్ర హీరోలెవరూ పూరీ జగన్నాథ్‌కు కాల్షీట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిటర్ల ఆందోళనను తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. నిర్మాత ఛార్మి దృష్టికి తీసుకెళ్లింది. ఫిల్మ్ ఛాంబర్ సమాచారంతో స్పందించిన ఛార్మి.. విషయమంతా తనకు తెలుసని, ఎగ్జిబిటర్లందరికీ మేలు జరిగేలా కృషి చేస్తున్నామని మెయిల్ ద్వారా సమాచారం పంపింది.
''పూరీ జగన్నాథ్ గారు మేము చేతులెత్తి చెబుతున్నాం. మేమంతా చాలా కష్టాల్లో ఉన్నాం. మీరిచ్చిన మాట ప్రకారం 6 నెలలు వెయిట్ చేశాం. అయినా మీరు స్పందించట్లేదు. మాకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వట్లేదు. అందుకే ఈరోజు మరోసారి రోడ్డెక్కాల్సి వచ్చింది. మీపై మాకు ఎలాంటి కోపం లేదు. మేము నష్టపోయిన డబ్బులను మాకిచ్చి ఆదుకోండి. చిన్న హీరోలు, పెద్ద హీరోలు ఎవరూ పూరీ జగన్నాథ్‌కు కాల్షీట్లు ఇవ్వకండి. మీరు డేట్స్ ఇస్తే మాకు న్యాయం జరగదు.'' - ఎగ్జిబిటర్లు