తెలంగాణ

telangana

ETV Bharat / state

DRIVING LICENCE: డ్రైవింగ్‌ ట్రాక్‌లో పరీక్షకు వెళ్లకుండానే లైసెన్స్​

ప్రైవేటు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందితే చాలు ఎలాంటి పరీక్షకు వెళ్లకుండానే లైసెన్సు రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన వెంటనే ఇందుకు కొత్త వ్యవస్థ ఏర్పాటు కాబోతోంది. రాజధాని పరిధిలో ప్రైవేటు డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలకు అనుమతి ఇచ్చే విషయంలో రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

license-without-going-to-the-test-on-the-driving-track
డ్రైవింగ్‌ ట్రాక్‌లో పరీక్షకు వెళ్లకుండానే లైసెన్సు

By

Published : Jul 27, 2021, 7:36 AM IST

ప్రస్తుతం ఎవరైనా డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవాలంటే తొలుత ప్రైవేటుగా శిక్షణ పొంది ఆపై దరఖాస్తు చేసుకుని ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్షకు హాజరు కావాలి. అక్కడ ఉత్తీర్ణత పొందిన ఆరు నెలల వ్యవధిలో రవాణా శాఖ డ్రైవింగ్‌ ట్రాక్‌కు వెళ్లి వాహనాన్ని సమర్థంగా నడిపి శాశ్వత లైసెన్సు పొందాలి. దీని స్థానంలో సరికొత్త విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది. ప్రైవేటు డ్రైవింగ్‌ పాఠశాలలకు కీలక బాధ్యతలు అప్పగించబోతోంది.

రెండు నెలల్లో..

కొత్త విధానాన్ని రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటే ప్రైవేటు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రస్తుతం భారీ ఎత్తున ప్రైవేటు శిక్షణ కేంద్రాలున్నా కూడా ఒక్కటి కూడా సక్రమంగా పని చేయడం లేదు. తూతూమంత్రంగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకోవడానికి సహకరిస్తున్నాయని చెబుతున్నారు. కొత్త వ్యవస్థ వల్ల తప్పనిసరిగా 30 రోజులపాటు కచ్చితంగా శిక్షణ తీసుకోవాల్సిందేదని దీనివల్ల వాహనం నడపడంలో మెలకువలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రైవేటు ఫిట్‌నెస్‌ కేంద్రాలు!

నిబంధనల ప్రకారం ఎనిమిదేళ్ల రవాణా వాహనానికి రెండేళ్లకోసారి, తొమ్మిదేళ్లు దాటిన వాహనానికి ఏటా రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంది. రవాణా శాఖ అధికారుల దగ్గర వాహన ఫిట్‌నెస్‌ తనిఖీ చేసే సాంకేతిక వ్యవస్థ లేదు. సిబ్బంది రోడ్ల మీద కొంత దూరం నడిపి ధ్రువపత్రం ఇచ్చేస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. వచ్చే అక్టోబర్‌ నాటికి ప్రతి రాష్ట్రంలో ప్రైవేటు ఫిట్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇవి ఏర్పాటైతే వాహన సామర్థ్యం ఎంతున్నది యంత్రాలే చెబుతాయి. సరిగా లేని వాహనాలను రోడ్డు మీదకు అనుమతించకుండా ఉండేందుకు కొత్త వ్యవస్థ బాగా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. రాజధాని చుట్టుపక్కల ఆరేడు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కొత్త విధానంలో ఇలా..

  • ద్విచక్ర వాహనదారులకు శిక్షణ ఇచ్చే ప్రైవేటు డ్రైవింగ్‌ పాఠశాల స్థాపించాలంటే ఎకరం స్థలం సొంతగా లేదా లీజుకుగాని తీసుకోవాల్సి ఉంది.
  • కార్లు ఇతర వాహనాలను నడిపే పాఠశాలకు రెండు ఎకరాలు ఉండాలి.
  • స్థలం ఉన్న వారు రవాణా శాఖకు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతి కోసం దరఖాస్తు చేయాలి.
  • అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వసతులున్నాయని తేలితే అనుమతి ఇస్తారు.
  • ద్విచక్ర లేదా కారు కోసం లైసెన్సు తీసుకునేవారైనా ఆ కేంద్రంలో కనీసం 30 రోజులపాటు వాహనం నడపడం నేర్చుకోవాలి.
  • కేంద్రాలన్నీ తర్ఫీదు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
  • శిక్షణ అనంతరం ఫాం బీ5 ఇస్తారు.
  • దీన్ని ఆర్టీవో కార్యాలయాలకు తీసుకెళ్తే ఎలాంటి పరీక్ష లేకుండానే లైసెన్సు జారీ చేస్తారు.

ఇదీ చూడండి:KTR: హుజూరాబాద్​పై కేటీఆర్‌ ఫోకస్.. నేడు ప్రధాన కార్యదర్శులతో సమావేశం

ABOUT THE AUTHOR

...view details