ఆషాఢం వచ్చిందంటే బోనాల సందడితో మార్మోగే భాగ్యనగరం.. ఈసారి కరోనా కారణంగా కళతప్పింది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో మార్మోగే వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. చారిత్రక ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి బోనాలు... కేవలం ఆలయ కమిటీ సభ్యుల మధ్య నిర్వహించారు. మీరాలం మండి మహంకాళి అమ్మవారి ఆలయంలో 27 రోజులుగా జరుగుతున్న చండీ యాగం ఇవాళ్టితో ముగిసింది. ఉప్పుగూడ నుంచి అమ్మవారి ఆలయం మీదుగా మీరాలం మండికి బంగారు బోనం సమర్పించారు. రోజంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి శాంతికల్యాణం కార్యక్రమం జరిగింది. రేపు అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
రావొద్దని చెప్పినప్పటికీ...
ఆలయాలకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ పలుచోట్ల భక్తులు బోనాలు ఎత్తుకుని వెళ్లి అమ్మవారికి సమర్పించారు. వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో శ్రీ కనకదుర్గ ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ పార్శిగుట్టలో బంగారు మైసమ్మగా అమ్మవారు కొలువుదీరారు. సైతాబాద్ మాతమైదానంలోని అమ్మవారికి గుడి బయటే భక్తులు బోనాలు సమర్పించారు. కోఠి, సుల్తాన్‌బజార్, నాంపల్లి, అంబర్‌పేట్ సహా గ్రేటర్ పరిధిలోని అన్ని ఆలయాల్లోనూ మహాశక్తికి ప్రత్యేక పూజలతో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. అమ్మవారి దయతో కరోనా పీడ తొలగిపోతే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయాల కమిటీల సభ్యులు చెబుతున్నారు.