తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 7:15 AM IST

Updated : Jul 10, 2020, 7:42 AM IST

ETV Bharat / state

కరోనాను ఎలా జయించారు..! నేతలు చెబుతున్న సూచనలు..

కరోనాపై పోరులో మనోనిబ్బరమే ఆయుధమని ఈ మహమ్మారి బారినపడిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు చెబుతున్నారు. కొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా కరోనాను జయించాలని సూచిస్తున్నారు.

lets-be-vigilant-lets-win-with-depression
అప్రమత్తంగా ఉందాం.. మనోనిబ్బరంతో జయిద్దాం

వాళ్లంతా ప్రజాప్రతినిధులు.. రాజకీయ నేతలు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేవారు. అందరినీ పలకరించాలి.. కలిసి మెలిసి తిరగాలి. పర్యటనలు, సమీక్షలు, సమావేశాలు.. ఇతర ప్రజా సంబంధమైన కార్యక్రమాలు, శుభకార్యాలు, పరామర్శలకు హాజరు కావాలి. ఎప్పుడు ఎలా సోకిందో కూడా తెలీకుండా కరోనా బారినపడ్డారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, నిజామాబాద్‌ నగర, గ్రామీణ, జనగామ నియోజకవర్గాల శాసనసభ్యులు గణేశ్‌ బిగాల, బాజిరెడ్డి గోవర్దన్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వీహెచ్‌, గూడూరు నారాయణరెడ్డి కొవిడ్‌ సోకినా చికిత్స పొంది కోలుకున్నారు. వారిని ‘ఈనాడు’ పలకరించినపుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా కరోనాను జయించామని తెలిపారు. వైద్యుల సలహాలను పాటించి, మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణ ద్వారా వైరస్‌ను పారదోలవచ్చని తెలిపారు. స్వీయ నియంత్రణతో అసలు ఈ వ్యాధి సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చునని వివరించారు.

జాగ్రత్తగా ఉండాలి..

కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడంలో నాకు ఇబ్బందేం రాలేదు. ఆసుపత్రిలో చేరి వైద్యుల సలహాలు, సూచనలు పాటించాను. వారు ఇచ్చిన మందులు, సి, డి విటమిన్‌ మాత్రలు వాడాను. చికిత్స సాఫీగా సాగింది. మందులు, గోలీలతో పాటు వేడినీళ్లు, తులసి నీళ్లు తాగడం వంటి వాటి వల్ల కోలుకుని ఇంటికి వచ్చాను. వారం రోజులు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రజలను కలుస్తాను. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందాలి. చల్లటి నీరు తాగవద్దు. ఇంటి భోజనం మాత్రమే చేయాలి. మన వద్ద కరోనా వ్యాధి సోకిన వారికి చక్కటి వైద్యం అందుతోంది. అందుకే మరణాలు తక్కువగా ఉన్నాయి.- మహమూద్ అలీ, హోం మంత్రి

హోం మంత్రి మహమూద్ అలీ

మనల్ని మనమే కాపాడుకోవాలి..

దుమ్ముగూడెం వద్ద ధర్నాకు పోయిన రోజు వర్షంలో తడిశాను. 19న రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా వస్త్రాలు పంచాను. ఆ తర్వాత కొంత అనారోగ్యంగా అనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌ రావడంతో ఆసుపత్రిలో చేరాను. 72 సంవత్సరాల వయసు కావడంతో అందరూ ఆందోళన చెందారు. నేను మాత్రం ఆత్మవిశ్వాసంతో దానిని ఎదుర్కొన్నాను. చికిత్సలో భాగంగా మందులు, యాంటీబయాటిక్స్‌, విటమిన్లు, పోషకాహారం ఇచ్చారు. యోగా చేశాను. కరోనా సమస్య తీవ్రంగా ఉంది. ఎవరికి వారే స్వీయ రక్షణ పాటించాలి. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి. మాస్క్‌లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.

- వి.హనుమంతరావు, మాజీ ఎంపీ

మాజీ ఎంపీ వి.హనుమంతరావు

నిర్లక్ష్యం చేయవద్దు..

మొదటి నుంచి కరోనాపై అప్రమత్తంగా ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. మాస్క్‌లు వాడాను. చుట్టుపక్కల ఉండేవాళ్లకు మాస్క్‌లు, శానిటైజర్లు, కళ్లద్దాలు పంపిణీ చేశాను. అయినా ఊహించని విధంగా నాకు సోకింది. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ చేరి చికిత్స పొందాను. వేడినీళ్లు, నిమ్మకాయ పిండుకొని తాగడం, జండూబామ్‌, పసుపు వేసుకొని ఆవిరి పట్టాను. జింక్‌, విటమిన్‌ సి మాత్రలు తీసుకున్నాను. విటమిన్‌ డీ చాలా ముఖ్యమైంది. చల్లటి వాతావరణానికి అలవాటు పడి ఎండకు దూరంగా ఉంటున్నాం. విటమిన్‌ డి ఆ లోటును తీరుస్తుంది. చివరకు కోలుకొని ఇంటికి వచ్చాను. కరోనాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితుడైనా, బంధువైనా రెండు మీటర్ల దూరంలో ఉండాలి. ఉదయం పూట ఎండలో ఉండాలి. - బాజిరెడ్డి గోవర్దన్‌, నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే

నిజామాబాద్‌ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

ధైర్యంగా ఉండాలి..

గత నెల మొదటివారంలో నేను, బాజిరెడ్డి గోవర్ధన్‌ కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. బాజిరెడ్డికి పాజిటివ్‌ రావడంతో నేనూ పరీక్షలు చేయించుకున్నాను. లక్షణాలు లేకపోయినా నాకు పాజిటివ్‌ అని తేలింది. వెంటనే ఆసుపత్రిలో చేరాను. చికిత్స ద్వారా కోలుకున్నాను. నా అనుభవాన్ని బట్టి కరోనాపై ప్రతీ ఒక్కరు మనో ధైర్యంతో ఉండాలి. మిగిలిన జబ్బుల మాదిరే ఇదొకటి. మనం ధైర్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలి. ఆసుపత్రి నుంచి హోం క్వారంటైన్‌కు వచ్చిన తర్వాత యోగాతో పాటు నా పనులు నేనే చేసుకుంటున్నా. మరో వారంరోజుల్లో ప్రజల్లోకి వస్తాను.

- గణేశ్‌గుప్తా బిగాల, నిజామాబాద్‌ నగర ఎమ్మెల్యే

నిజామాబాద్‌ నగర ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా బిగాల

వైరస్‌ ప్రాణాంతకం కాదు..

కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత నేనేమీ ఆందోళన చెందలేదు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాను. నేను రోజూ వ్యాయామం చేస్తాను. చికిత్స సమయంలోనూ కొనసాగించాను. మిగిలిన కొన్ని జబ్బులతో పోలిస్తే ఇది ప్రాణాంతకం కాదు. కొద్దిమంది మాత్రమే చనిపోతున్నారు. చాలామందికి తెలియకుండానే వచ్చిపోతోంది. వేడి భోజనం చేయాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు కడిగే భోజనం చేయాలి. ఇప్పుడు సీజనల్‌ వ్యాధులుంటాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి. మానసికంగా శారీరకంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగాసనాలు వేస్తుండాలి. సమయానికి భోజనం చేయాలి.

- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ ఎమ్మెల్యే

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

నమ్మకమే సగం నయం చేస్తుంది..

మొదట్లో నేను వాసన కోల్పోయాను. తర్వాత శ్వాసపరమైన అనారోగ్యం కలగడంతో పరీక్ష చేయించుకోగా కరోనా అని తేలింది. వైద్యులు చక్కటి చికిత్స చేశారు. నమ్మకమే సగం నయం చేస్తుంది. రోజు ఉదయాన్నే 20 నిమిషాల పాటు ఎండలో ఉండాలి. నిమ్మకాయలను ఎక్కువగా వాడాలి. రసం తాగొచ్చు. పులిహోర, పచ్చడి వంటివి చేసుకోవచ్చు. జింక్‌, మల్టీ విటమిన్‌ మాత్రలు వాడాలి. విటమిన్‌ సి మాత్రలు చప్పరించాలి. కరోనా సమయంలో కొత్త వాళ్లను ఇంటికి రానీయవద్దు. వేరేవాళ్ల ఇంటికి మనం వెళ్లవద్దు.

- గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ నేత

గూడూరు నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ నేత

ఇదీచూడండి:జూలు విదుల్చుతోన్న కరోనా... రాష్ట్రంలో 30వేలు దాటిన కేసుల సంఖ్య

Last Updated : Jul 10, 2020, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details