తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ 'సిటి'జెన్స్‌ అవుదాం.. - 2020 year

దేశ సుసంపన్నతను చాటే రెండు కళ్లు - పల్లెలు, పట్టణాలు. ఇందులో ఓ కన్ను రెండో కన్నువైపు చూస్తోంది. పల్లె జనం పట్నం బాట పడుతున్నారు. దీంతో నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. ఊహకందని రీతిలో విస్తరిస్తున్నాయి. వీటిని నివాసయోగ్యంగా మార్చడం కొత్త దశాబ్దిలో ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు. జనం ఆరోగ్యంగా, సంతోషంగా, సౌకర్యవంతంగా జీవించే పరిస్థితులు సృష్టించడం కీలకం. దీన్ని ఎలా సాధించాలి? ఈ లక్ష్య సాధనకు ప్రభుత్వాలు, పౌరులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటి?

Let's be the best Citizens in india
ఉత్తమ సిటీజెన్స్‌ అవుదాం..

By

Published : Dec 27, 2019, 9:04 AM IST

Updated : Dec 27, 2019, 2:10 PM IST

నగరాలు.. నాగరికతకు చిరునామాలు. సృజనాత్మకతకు ప్రతీకలు. నవకల్పనలకు కేంద్ర స్థానాలు. గతిశీలతకు నిలువుటద్దాలు. ఆర్థికవృద్ధి, ఉపాధి, విద్య, ఆరోగ్య సేవలు, శాస్త్ర, సాంకేతికతలకు చోదకశక్తులు.

నగరాన్ని నవ్విద్దాం...

నగరాలను నివాస యోగ్యంగా ఎలా మలుస్తాం? సంతోష నగరాల్ని ఎలా సృష్టిస్తాం? అనేవి కొత్త దశాబ్దిలో అత్యంత కీలకాంశాలు.

ప్రపంచీకరణ - పల్లెను పట్నంగా.. పట్నాన్ని నగరంగా.. నగరాన్ని మహానగరంగా మార్చేస్తోంది. అవకాశాల వేదికలైన నగరాల్లోకి వలసలు పోటెత్తుతున్నాయి. దాని ప్రభావంతో గొలుసుకట్టుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాలుష్యం కమ్మేస్తోంది. వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాహనాల రద్దీతో రహదారులు చీమల పుట్లను తలపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు అడుగంటు తున్నాయి. నగర శివార్లు ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్నాయి. ఈ సమస్యల సుడిగుండం నుంచి బయటపడి.. పట్టణాలు, నగరాలను చక్కని నివాసయోగ్య ప్రాంతాలుగా తీర్చిదిద్దితేనే నాగరికతకు సార్థకత. ఈ బాధ్యత ప్రభుత్వం ఒక్కదానిదే కాదు, పౌరులది, పౌర సమాజాలది, స్థానిక సంస్థలది, ప్రణాళికా రూపకర్తలది కూడా. ఇందుకు ఆధునికీకరణ, అభివృద్ధికి సాంకేతిక వినియోగం కీలకం.

మనమేం చేయాలి?

సూక్ష్మంలో మోక్షం

వచ్చే 30 ఏళ్లలో నగరాలు నేటి కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ శక్తిని పుంజుకోవాలి. దీనికి ఓ మార్గం ‘తక్కువలో ఎక్కువ’ సాధించడం. నిరుపయోగ ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు, భవనాలను ప్రజావసరాలు తీర్చేలా మార్చాలి. మెల్‌బోర్న్‌లో 86 హెక్టార్లలోని ఖాళీ స్థలాల్లో రోడ్లు, మల్టీస్టోరేజ్‌ పార్కింగ్‌ భవనాలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. వాహనాల వినియోగం తగ్గించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌లకు ఆనుకుని నివాస ప్రాంతాలను సృష్టించారు.

తాగునీటికి ‘ఐఓటీ’

ప్రపంచ నగరాల్లో 2030 నాటికి తాగునీటి అవసరాలు 40% పెరగనున్నాయి. మరోవైపు ఇప్పటికే లీకేజీలతో 25-30% నీళ్లు వృధా పోతున్నాయి. ఈ సమస్యకు ఇజ్రాయిల్‌లో పైపులను ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌తో అనుసంధానిస్తూ సెన్సర్లను బిగించి క్లౌడ్‌ ఆధారిత పరిష్కారాన్ని కనుగొన్నారు. దీంతో పైపులు లీకైనా, ధ్వంసమైనా క్షణాల్లో గుర్తించవచ్చు. మరోవైపు వర్షపునీటినీ ఈ విధానంతో ఒడిసి పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోనూ పైపుల మరమ్మతు, సెన్సార్లతో వృధా నీటిని అరికట్టడం ద్వారా ఏడాదిలో దాదాపు రూ.135 కోట్లు ఆదా చేశారు. ఈ సరికొత్త టెక్నాలజీతో నీటిలోని బ్యాక్టీరియా, వైరస్‌ల గుర్తింపునకూ వీలవుతోంది. ఇతర నగరాలూ ఇలాంటి సాంకేతికతను వాడొచ్చు.

చెట్లకూ మెయిల్‌ ఐడీలు

పట్టణాలు, నగరాల్లో 10 శాతం పచ్చదనాన్ని పెంచాలనేది ఐరాస సూచన. ఇందుకు ఆస్ట్రేలియా ‘అర్బన్‌ గ్రీనరీ’ విధానాన్ని అమలుచేస్తోంది. ఒక్క మెల్‌బోర్న్‌లోనే 70 వేల మొక్కలు నాటారు. ప్రతి మొక్కను ఒక్కో పౌరుడికి దత్తత ఇచ్చి, ట్యాగ్‌ వేశారు. ప్రతి మొక్కకూ మెయిల్‌ ఐడీలను సృష్టించారు. పౌరులంతా ఈ చెట్ల సంరక్షణపై మెయిళ్లు పంపవచ్చు.

ఐసీటీ.. నయా సాంకేతికత

రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణకు డిజిటల్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీని వినియోగించాలి. దీనిద్వారా ఒక మార్గంలో ఎన్ని వాహనాలు, ఎంతమందితో ప్రయాణిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవచ్చు. వాహన సామర్ధ్యానికి తగినంత మంది లేకుంటే నియంత్రించొచ్చు.

ప్రజా రవాణాకు ప్రోత్సాహం

నగరాలు, పట్టణాల్లో మరిన్ని పార్కులు, క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాలి. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌, మెట్రో, సబర్బన్‌ రైళ్లు వంటి వాటిని మరింతగా అందుబాటులోకి తేవాలి.

‘కొత్త తరం ఎల్‌ఈడీలు

కొద్ది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వీధిలైట్లు తక్కువ విద్యుత్తును వాడే ఎల్‌ఈడీలుగా మారనున్నాయి. భవిష్యత్తులో మలితరం ఎల్‌ఈడీలు రానున్నాయి. ఇవి వాతావరణం, కాలుష్యం, భూకంప సంకేతాలు, ట్రాఫిక్‌, ప్రజా కదలికలు, శబ్దాలు వంటివాటిని కూడా నమోదు చేస్తాయి. ఇప్పటికే షికాగోలో లైట్‌ సెన్సరీ నెట్‌వర్క్‌ పేరిట ఇలాంటి సాంకేతికను విజయవంతంగా పరీక్షించారు. అన్ని నగరాల్లోనూ ఇలా చేయొచ్చు.

పెడల్‌ పవర్‌ బ్యాటరీ సైకిళ్లు

నగరాలన్నీ వాహనమయం కావడంతో నడకకు, సైక్లింగ్‌కు కష్టమవుతోంది. రద్దీ వేళల్లో సైకిళ్లపై వేగంగా వెళ్లేందుకు రోడ్లపై ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తే ప్రజలు స్పందిస్తారు. అధునాతన పెడల్‌ పవర్‌ బ్యాటరీ సైకిళ్లను అందుబాటులోకి తేవాలి. ఇవి దిగువకు ప్రయాణిస్తున్నప్పుడు, బ్రేక్‌ వేసినప్పుడు ఛార్జి అవుతుంటాయి. లండన్‌ నగరంలో ప్రత్యేకించి సైకిళ్లపై రాకపోకలు సాగించేందుకు ‘సైనెమోన్‌’ (సైక్లింగ్‌ నెట్‌వర్క్‌ మోడల్‌ ఫర్‌ లండన్‌) పేరుతో రహదారుల పక్కన, వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గాలను నిర్మించారు.

నగర వ్యవసాయం

భవనాల పైకప్పులు, గోడలపై మట్టి అవసరం లేని సేద్యాన్ని ప్రోత్సహించాలి. హైడ్రోఫోనిక్స్‌ సాగు విధానంతో నగరాలు, పట్టణాల్లో ఆహార కొరతను, ఖర్చులను తగ్గించవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే నీటి వినియోగాన్ని నియంత్రించవచ్చు. లండన్‌లో ఈ విధానం విజయవంతమైంది. ఇతర నగరాలూ అందిపుచ్చుకోవాలి.

వలసల్ని తగ్గిద్దాం

అవకాశాలు ఊరిస్తుండడంతో జనం పల్లెలు వదిలి పట్నాల బాట పడుతున్నారు. అలా కాకుండా పల్లెల్లోనే తగిన సదుపాయాలు, అవకాశాలు కల్పిస్తే.. వారు నగరాల వైపు రాకుండా అక్కడే ఉండటానికి ఇష్టపడతారు.

భారత్‌లో 12 మెట్రోపాలిటన్‌ నగరాలున్నాయి. 1950 నాటికి దేశ జనాభాలో 17.1 శాతంగా ఉన్న పట్టణవాసులు 2010 నాటికి 30.9 శాతానికి చేరారు. 2030 నాటికి 40.14 శాతానికి, 2050 నాటికి 52.84 శాతానికి చేరవచ్చని అంచనా. అప్పటికి భారత్‌లో పట్టణ జనాభా 81.5 కోట్లు ఉంటుందని అంచనా.’’

Last Updated : Dec 27, 2019, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details