నగరం చుట్టుపక్కల జిల్లాల్లోని భారీ నిర్మాణ సంస్థలు భూములు-భవనాలను రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ముందుకు రావట్లేదు. దీనికి సాంకేతికంగా అనేక కారణాలున్నాయని రియల్ ఎస్టేట్ ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మూతపడిన రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు.. కొద్ది రోజుల కిందట తెరుచుకున్న విషయం తెలిసిందే. క్రమంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతున్నా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం మాత్రం రావడం లేదు. మరో పదిహేను రోజుల్లో పూర్తిస్థాయిలో ఊపందుకుని గత ఏడాదిలానే ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆశించిన స్థాయిలో లేవు..
రోజుకు సుమారు 4 వేలు.. దాదాపు 45 రోజుల తర్వాత కార్యాలయాలు తెరుచుకోగా భారీగా అపార్టుమెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అంతా అనుకున్నారు. గత ఏడాది రోజూ 6వేలకు పైగా జరిగేవి. దీనిమీద నిత్యం రూ.20కోట్లు నుంచి రూ.22 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7050 కోట్ల మేర ఆదాయం వచ్చింది. లాక్‌డౌన్ ఆంక్షల తర్వాత కార్యాలయాలను తిరిగి తెరిస్తే ప్రస్తుతం నాలుగువేల వరకు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రోజూ రూ.10కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల సంఖ్య బాగానే ఉన్నా గత ఏడాదిలా ఆదాయం రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.