తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ నిబంధనల ప్రకారమే శాసన మండలి సమావేశాలు: గుత్తా

శాసన మండలి సమావేశాలు కొవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను తరలిస్తామంటే తెలంగాణ అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. శ్రీశైలం ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని.. అనవసర రాజకీయాలు తగవన్నారు. కేటీఆర్ అన్ని పదవులకు సమర్థుడని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

కొవిడ్‌ నిబంధనల ప్రకారం శాసన మండలి సమావేశాలు: గుత్తా సుఖేందర్‌ రె‌డ్డి
కొవిడ్‌ నిబంధనల ప్రకారం శాసన మండలి సమావేశాలు: గుత్తా సుఖేందర్‌ రె‌డ్డి

By

Published : Aug 31, 2020, 5:38 PM IST

కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శాసనమండలి సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. శాసనమండలి కార్యాలయంలో విలేకరులతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందన్నారు. శరీర ఉష్ణోగ్రత పరిశీలించేందుకు థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. భౌతిక దూరం ఉండేందుకు వీలుగా అదనంగా 8 సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ చెప్పారు.

సందర్శకులకు అనుమతి ఉండదని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సుమారు 20 రోజుల సమావేశాలు జరపాలని ప్రభుత్వం భావిస్తోందని.. అయితే బీఏసీలో తుది నిర్ణయం ఉంటుందన్నారు. ఈసారి నాలుగు బిల్లులు వచ్చే అవకాశం ఉందని.. కొత్త రెవెన్యూ చట్టం బిల్లులను కూడా తీసుకురావాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. కృష్ణా జలాల తరలింపుపై అన్ని వేదికలపై తెలంగాణ అభ్యంతరం చెబుతూనే ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల ద్వారా అక్రమంగా నీళ్లు తరలిస్తామంటే అంగీకరించేది లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి.. జానారెడ్డితో కలిసి పోతిరెడ్డిపాడుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాశామని గుర్తు చేశారు.

శ్రీశైలం ప్రమాదంపై అనవసర విమర్శలు చేయడం సరికాదని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదం మానవ తప్పిదంతో జరిగిందా.. సాంకేతిక కారణాల అనే విషయంపై విచారణ జరుగుతోందన్నారు. తెలంగాణకు జీవనాడి వంటి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టుపై కుట్ర ఎందుకన్నారు. పిల్లాయిపల్లిలో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి అంశంపై స్పందించిన సుఖేందర్ రెడ్డి... ఎప్పటి నుంచో వివాదం జరుగుతోందని.. తుపాకీ బయటకు తీసే సరికి చిన్న వివాదం పెద్దగా మారిందని వ్యాఖ్యానించారు. పీవీ నర్సింహారావుతో వ్యక్తిగత అనుబంధం ఉందని.. ఆయనను మూడు, నాలుగు సార్లు కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని.. శాసన మండలి ఛైర్మన్ గా రాజ్యాంగ పదవిలో సంతృప్తిగా ఉన్నానని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఉద్యమ కారులకు అన్యాయం చేయరనే నమ్మకం తనకుందన్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. రాజకీయ సమీకరణాల కోసం ఇతర పార్టీ నేతలను చేర్చుకోక తప్పదన్నారు. కేటీఆర్ అన్ని పదవులకు సమర్థుడేనని.. అయితే పదవులపై నిర్ణయం కేసీఆర్​దేనని వెల్లడించారు.

ఇదీ చదవండి:'కొవాగ్జిన్'​ రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details