Telangana Budget Sessions 2023 : రాష్ట్ర బడ్జెట్ ఆమోదం విషయంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన సందిగ్ధతకు తెరపడిన నేపథ్యంలో.. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు.. 6న బడ్జెట్ - Telangana budget sessions
21:30 January 30
ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు.. 6న బడ్జెట్
హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ, రాజ్‌భవన్ తరఫు న్యాయవాదుల మధ్య చర్చల అనంతరం రాజ్యాంగ బద్ధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంతరెడ్డితోపాటు పలువురు అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు కొందరు అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్ సమావేశాలపై గవర్నర్‌తో చర్చించారు. ఆ తర్వాతనే బడ్జెట్ సమావేశాల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది.
మరోవైపు.. గత శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన 8 బిల్లుల్లో 7గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వివాదం సమసిపోయినందున.. బిల్లుల అంశానికి కూడా పరిష్కారం లభించనున్నట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, మరికొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి బిల్లు, జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాల సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులు సెప్టెంబర్ 13న ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో జీఎస్టీ చట్ట సవరణ బిల్లు మాత్రమే గవర్నర్ ఆమోదం పొందగా.. మిగిలిన 7 పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని ఆహ్వానించిన సమయంలోనే... మంత్రి ప్రశాంత్‌రెడ్డి....బిల్లుల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఇవీ చదవండి: