Leaders Offering Money Before Polling in Telangana : ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు, ఎన్నికల అధికారులు, ప్రత్యేక బృందాలు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి.. రోజు కోట్ల కొద్దీ నగదు, బంగారం, వెండి, అక్రమ మద్యం, మత్తుపదార్ధాలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.745 కోట్ల పైమాటేనని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్ గూడ నుంచి మేడిపల్లి వైపు ఇన్నోవా వాహనంలో రూ.11 లక్షలు తీసుకెళుతుండగా స్థానికులు పట్టుకొని ఎన్నికల అధికారులకు సమాచారం అందజేశారు. మియాపూర్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ నడ్డిగడ తండాలో బీఆర్ఎస్ తరఫున డబ్బులు పంచుతున్నారంటూ కొందరు అతనిపై దాడి చేశారు. దీంతో బాధితుడు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - పోలీసుల తనిఖీల్లో రూ.724 కోట్ల సొత్తు సీజ్
Money Giving For Vote : యాదాద్రి భునవగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రలోభాలకు పాల్పడుతున్నాడని కాంగ్రెస్ నేతలు పోలీసులకి సమాచారమిచ్చారు. వెల్దేవి, హాజీంపేట గ్రామాల్లో తనిఖీలు చేసి ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో పోలీసులు అక్కడినుంచి వెళ్ళిపోయారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు వాహనంలో మద్యం కాటన్లను తరలిస్తుండగా ప్రత్యేక అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.2 లక్షల 26 వేలు ఉండవచ్చు అని అంచన వేశారు.