Mallu Swarajyam is no more: రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. సాయుధ పోరాటానికి తుంగతుర్తి గడ్డ అందించిన గొప్ప బిడ్డ స్వరాజ్యమని సీఎం అన్నారు. మల్లు స్వరాజ్యం గమనం, గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తి ఇచ్చిందని కొనియాడారు. గొప్ప మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు అని సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సురవరం సంతాపం
మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి సంతాపం తెలియజేశారు. ప్రముఖ మహిళా నాయకురాలు మల్లు స్వరాజ్యం మృతి తీవ్రమైన బాధను కలిగించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించారని తెలిపారు. శాసనసభ్యురాలిగా రైతులు, శ్రామికులు, పేద ప్రజల తరఫున వారి వాణి వినిపించారన్నారు. వేలాది మంది మహిళలకు కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆమె స్ఫూర్తిని కలిగించారని గుర్తుచేశారు. చివరిదాకా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నారన్న ఆయన.. ఆమె ఒక అరుదైన పోరాట యోధురాలని కీర్తించారు. సీపీఐ జాతీయ సమితి తరఫున వారికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
సభాపతి పోచారం సంతాపం
మల్లు స్వరాజ్యం మృతి పట్ల సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలియజేశారు. స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పేదల పక్షాన పోరాడారని ఆయన పేర్కొన్నారు. రజాకార్లను ఎదురించి పోరాడిన యోధురాలని కీర్తించారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. స్వరాజ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్వరాజ్యం పేరు ఉంటే పోరాటం గుర్తుకు వస్తుంది..