తెలంగాణ

telangana

ETV Bharat / state

Layout Rules: 60 గజాల్లోనూ ప్లాట్లు.. లేఅవుట్లకు కొత్త నిబంధనలు ఇవే..! - story on layouts new rules 2021

రాష్ట్రంలో లేఅవుట్‌ల నిబంధనలను ప్రభుత్వం (telangana government) పటిష్ఠం చేసింది. అభివృద్ధిదారులను బాధ్యతాయుతంగా చేయడంతో పాటు స్వీయ ధ్రువీకరణ ద్వారా లేఅవుట్‌(layout) అనుమతికి పురుపాలక శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని గతం కంటే తగ్గించింది. కొత్త పురపాలక చట్టం, టీపాస్​ బీపాస్‌ చట్టం (tsbpass) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నూతన లేఅవుట్‌లు, సబ్‌డివిజన్‌ నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

layouts new rules in telangana
రాష్ట్రంలో లేఅవుట్లకు కొత్త నిబంధనలు

By

Published : Jul 12, 2021, 7:40 AM IST

తెలంగాణలో లేఅవుట్‌ల నిబంధనలు (layout new rules) మరింత పటిష్ఠం అయ్యాయి. ప్రభుత్వం దీనిపై ఉత్తర్వలు (Orders)జారీ చేసింది. లేఅవుట్‌ల అనుమతికి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. స్వీయ ధ్రువీకరణ ద్వారా లేఅవుట్‌ అనుమతినిస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన లేఅవుట్‌ అభివృద్ధిదారులను బ్లాక్‌లిస్టులో(blacklist) ఉంచనున్నారు. లేఅవుట్‌ వేసిన తర్వాత... అదే విధంగా ప్లాట్ల కనీస విస్తీర్ణాన్ని 60 చదరపు గజాలు, కనీస వెడల్పు 20 అడుగులుగా నిర్ధారించింది. ప్రతి లేఅవుట్‌లో 2.5 శాతం స్థలాన్ని అదనంగా సామాజిక వసతుల కల్పించడానికి కేటాయించాల్సి ఉంటుంది. దీనికి ఉండాల్సిన అప్రోచ్‌ రోడ్డు 60 అడుగులు ఉంచాలి. 50 హెక్టార్లకు మించిన విస్తీర్ణంలో వేసే లేఅవుట్‌లకు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని సర్కారు స్పష్టం చేసింది.

నగరపాలికలు, పురపాలక సంఘాలకు వర్తింపు

లేఅవుట్‌లో 15 శాతం స్థలాన్ని పురపాలక శాఖకు తనఖా పెట్టాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో రెండేళ్లలో మౌలిక వసతులు కల్పించకుండా... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తనఖా పెట్టిన 15 శాతం ప్లాట్ల విస్తీర్ణాన్ని పురపాలక శాఖే విక్రయించి మౌలిక వసతులు కల్పించేలా అధికారం కట్టబెట్టింది. కొత్త లేఅవుట్‌ నిబంధనలు(new layout rules) ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ లేఅవుట్‌లకు అనుమతి మంజూరు చేయనుంది. కొత్త లేఅవుట్‌ నిబంధనలు జీహెచ్‌ఎంసీ(ghmc), హెచ్‌ఎండీఏ(hmda) మినహా రాష్ట్రంలోని అన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు వర్తిస్తాయి.

నిర్దేశించిన వాటికి మాత్రమే వినియోగం

లేఅవుట్‌లో వేసే ప్లాట్ల విస్తీర్ణంలో మార్పులు చేశారు. కనీస విస్తీర్ణం గతం కంటే తగ్గించారు. కనీస ప్లాట్ల విస్తీర్ణం 60 గజాలు ఉంటే సరిపోతుంది. గతంలో కనీస ప్లాట్ల విస్తీర్ణం 143 చదరపు గజాలు ఉండేది. రోడ్డు వైపు ప్లాట్ల కనీస వెడల్పు 6 మీటర్లు ఉండాలి. గతంలో ఇది పది మీటర్లుగా ఉండేది. మూడేళ్లలో లేఅవుట్‌ అభివృద్ధిదారుడు, లేదా సంస్థలు నిర్ధేశించిన మౌలిక సదుపాయాలను కల్పించకుంటే వారిని లేఅవుట్‌లు వేయకుండా బ్లాక్‌ లిస్టులో పెడతారు. మొత్తం లేఅవుట్‌ ప్రాంతంలో 2.5 శాతం స్థలాన్ని సామాజిక సదుపాయాలకు కేటాయించాలి. ఫార్మసీ, ఆసుపత్రి, పాఠశాల, ప్లే స్కుల్‌, క్రష్‌, డిస్పెన్సరీ వంటి వాటికి మాత్రం వినియోగించుకోవాలి. ఈ స్థలాన్ని లేఅవుట్‌ అభివృద్ధిదారుడు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. నిర్దేశించిన వాటికి మాత్రం ఉపయోగించాల్సి ఉంటుంది.

అనుమతి ఇలా పొందొచ్చు

50 ఎకరాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో లేఅవుట్‌లు ఉంటే పాఠశాల, ఆరోగ్యకేంద్రం, వాణిజ్యసదుపాయాలకు నిర్దేశించిన మేర స్థలం కేటాయించాలి. లేఅవుట్‌కు టీఎస్‌ బీపాస్‌(tsbpass) ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతి లభిస్తుంది. దరఖాస్తు సమయంలో నిర్దేశించిన పత్రాలతో పది వేల రూపాయల రుసుం చెల్లించాలి. సమాచారం అంతా పక్కాగా ఉంటే కమిటీ అనుమతి ఇస్తుంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కన్వీనర్లుగా వ్యవహరించే కమిటీ లేఅవుట్‌లకు అనుమతి ఇస్తుంది.

ABOUT THE AUTHOR

...view details