అధిష్ఠానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. మోదీ భయంతోనే కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తామన్నారు.
'ఆదేశిస్తే ఎంపీ బరిలో' - HYDERANBAD
అసెంబ్లీ పోరులో ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్న కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విరబూయాలని తాపత్రయపడుతోంది. కార్యకర్తలను ఉత్తేజపరచడానికి దిగ్గజాలు రంగంలోకి దిగుతున్నారని... ఈసారి సత్తా చాటుతామని లక్ష్మణ్ తన మదిలో మాటలు పంచుకున్నారు.

ఎంపీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లదేనని, మార్చి రెండు తర్వాత ఎంపికపై దృష్టి సారిస్తామన్నారు. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఈ నెల చివరన అమిత్ షా, మార్చి మొదటి వారంలో నరేంద్ర మోదీ రానున్నారని తెలిపారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయన్నారు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓడిపోవడానికి చంద్రబాబు, కేసీఆర్ పథకాలు, దొంగఓట్లు, ఈవీఎంలే ప్రధాన కారణమన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలంటే ఓటరు నమోదును ఆధార్‌తో అనుసంధానం చేయాలని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.