Laxman Fires On Telangana Government: మునుగోడు ఉప ఎన్నికల దృష్ట్యా చేనేత ఓటర్లను తెరాస తప్పుదారి పట్టిస్తుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై తెరాస ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం 5 శాతం చేనేత పన్నుకు అంగీకరించి సంతకాలు చేసిందని తెలిపారు. ప్రభుత్వానికి చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే 5 శాతం జీఎస్టీలో రాష్ట్ర వాటా 2.5 శాతం వదులుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్నిలక్ష్మణ్ ప్రశ్నించారు. టేస్కోకు ఛైర్మన్, డైరెక్టర్ లేకుండా మీరెందుకు పెత్తనం చెలాయిస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి నిలదీశారు. గతంలో అప్కో ద్వారా నామమాత్రపు వడ్డీతో నేతన్నలకు రుణాలు లభించేవని గుర్తు చేశారు. టెస్కోకు ఛైర్మెన్, డైరెక్టర్ లేకపోవడంతో.. విధిలేని పరిస్థితుల్లో బ్యాంక్ ద్వారా అధిక శాతం వడ్డీకి చేనేత కార్మికులు రుణాలు తీసుకుంటున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.