TS High Court: హైకోర్టు దృష్టికి కొత్త సంవత్సర వేడుకల వ్యవహారం...
13:54 December 29
కొత్త సంవత్సర వేడుకలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది
Lawyer Chikkudu Prabhakar: కొత్త సంవత్సర వేడుకలను న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వేడుకల ఆంక్షలపై హైకోర్టులో ప్రస్తావించారు. కోర్టు ఉత్తర్వులు సర్కారు అమలు చేయట్లేదని అన్నారు. వేడుకల వేళలు మరింత పెంచి ఉత్తర్వులిచ్చారని వెల్లడించారు. విచారణ చేపట్టి వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టును కోరారు.
మంగళవారం మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతిచ్చింది. అదేవిధంగా ఈవెంట్ల నిర్వహణ వేళలు సైతం పొడిగించింది. ఒంటిగంట వరకు బార్లు, ఈవెంట్లు, టూరిజం హోటళ్లలో మద్యం వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి ఈవెంట్ల నిర్వహణకు అబ్కారీ శాఖ తాత్కాలిక లైసెన్స్‌లు జారీ చేస్తుంది. అయితే ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను బట్టి కనీసం రూ.50వేలు ఉండగా అత్యధికం రూ.2.50 లక్షలు తాత్కాలిక లైసెన్స్ ఫీజుగా అబ్కారీ శాఖ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే.... న్యాయవాది చిక్కుడు ప్రభాకర్... సర్కారు తీరుపై హైకోర్డులో ప్రస్తావించారు. విచారణ చేపట్టి వేడుకలపై ఆంక్షలు విధించాలని అన్నారు. విచారణను రేపు పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.