సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణతో పాటు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా లేఖ రాసి, దాన్ని బహిరంగంగా విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజేయకల్లంలపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించేందుకు సమ్మతి ఇచ్చే అవకాశాన్ని పునః పరిశీలించాలంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు భాజపా నేత, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ మరో లేఖ రాశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నది జగన్ రాసిన లేఖేనని... కోర్టు ధిక్కరణ ఫిర్యాదు కాదని పేర్కొన్నారు. అందువల్ల కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఏజీ కేకే వేణుగోపాల్‌కు విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎం జగన్ లేఖలో పేర్కొన్న అంశాలు కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా లేదా నిర్ణయించే అధికారం ప్రస్తుతానికి సీజేఐకి మాత్రమే ఉన్న మాట వాస్తవమని అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తరఫున అజేయకల్లం లేఖను మీడియాకు విడుదల చేశారని గుర్తు చేశారు. సీజేఐకి రాసిన లేఖ ప్రైవేట్ విషయం అయినప్పటికీ... మరో సహ పాత్రధారి తెరమీదకు వచ్చి అదనపు ప్రకటన చేశారని ఏజీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల్లో న్యాయమూర్తులపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని.. ఇది ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని పేర్కొన్నారు.