ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని చేపట్టిన మహా పాదయాత్ర(Amaravati Farmers Maha Padayatra )లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల మధ్యే రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. నాగులుప్పలపాడు నుంచి ముక్తినూతలపాడు వరకు రైతులు పాదయాత్ర చేయనున్నారు. పోలీసులను తోసుకుంటూ రైతులు ముందుకు కదులుతున్నారు.
ఎన్నికల కోడ్ నడుమ
ఏపీ ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ ఉందంటూ పోలీసులు.. నాగులుప్పలపాడు వెళ్లే మార్గంలో రోడ్లను దిగ్బంధిస్తున్నారు. ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల నడుమ రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ లక్ష్యాన్ని అడ్డుకోలేరంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు. రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల వారు సంఘీభావం తెలుతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, నేతలు పాల్గొంటున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర పేరుతో నవంబర్ 1వ తేదీన రైతులు మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు సాగునున్న ఈ పాదయాత్ర.. డిసెంబర్ 15వ తేదీన చిత్తూరు జిల్లాలో ముగియనుంది.
బుధవారం ఇలా సాగింది..
అమరావతి రైతుల మహా పాదయాత్ర(maha Padayathra)కు పూల వర్షంతో పల్లె జనులు స్వాగతం పలుకుతున్నారు. పది రోజులు పూర్తి చేసుకున్న యాత్ర బుధవారం ప్రకాశం జిల్లాలో సాగింది. ఉదయం 9 గంటలకు దుద్దుకూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర రాచపూడి, కల్లగుంట మీదుగా సాయంత్రం నాగులుప్పలపాడు చేరుకుంది. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని రైతులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు మద్దతుగా తరలిరాగా.. 4 కి.మీ మేర జన జాతరను తలపించింది. మరోవైపు మఫ్టీలో ఉన్న పోలీసులు ఫొటోలు తీస్తూ, డ్రోన్‌తో వీడియో చిత్రీకరిస్తూ కనిపించారు. అమరావతికి మద్దతు తెలుపుతూ ప్రజలు తమ వెంట తెచ్చుకున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘నాటి స్వాతంత్య్ర సమరయోధుల అసలైన వారసులు నేటి అమరావతి రైతులు’, ‘వృథా పోదు తల్లి.. మీ కష్టం, ఏకైక రాజధానిగా అమరావతి తథ్యం’, ‘మూడు రాజధానులు వద్దు...ఒకే రాజధాని ముద్దు’ వంటి బ్యానర్లు కనిపించాయి. ఖమ్మంకు చెందిన ప్రకాశరావు దంపతులు ఆలోచింపజేసే బ్యానర్‌తో యాత్రలో పాల్గొన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని రాచపూడి వద్ద స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో రైతులకు స్వాగతం పలికారు.
పూల దారిపై నడక
పూల దారిపై నడిపిస్తూ..సంఘీభావం తెలపడానికి వస్తున్న మహిళలు మహా పాదయాత్ర(maha Padayathra)కు గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 700 కాయలు వినియోగించారు. దుద్దుకూరు నుంచి రాచపూడి వరకు 4 కి.మీ మేర పూల మార్గం ఏర్పాటు చేశారు. పర్చూరు, అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, రవికుమార్, శ్రీబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌రావు, తెనాలి శ్రావణ్‌కుమార్, ముత్తముల అశోక్‌రెడ్డి, బీఎన్ విజయ్‌కుమార్, డేవిడ్‌రాజు, ఐకాస నేత కొటికలపూడి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తదితరులు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్నారు. మరోవైపు బుధవారం ఒక్క రోజే యాత్రకు రూ.60 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. అద్దంకి నియోజకవర్గ ప్రజలు రూ.36 లక్షలు, ఎమ్మెల్యే రవికుమార్ బృందం రూ.10లక్షలు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రూ.10 లక్షలు విరాళమిచ్చారు.
ఇదీ చూడండి:AMARAVATI PADAYATRA: అమరావతి పాదయాత్రకు హెచ్చరికలు.. భారీగా మోహరించిన పోలీసులు
Maha Padayatra 11th Day: జోరువానలో అమరావతి హోరు.. ప్రజ్వలిస్తున్న మహాపాదయాత్ర