Jagadgirigutta Fire Accident Update : ఇటీవల హైదరాబాద్ జగద్గిరిగుట్టలో జరిగిన అగ్నిప్రమాదంలో జిమ్ కోచ్ డెత్ మిస్టరీ వీడింది. తొలుత ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తులో హత్యగా తేల్చారు. భార్యే పథకం ప్రకారం.. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అసలేం జరిగిందంటే: హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 10వ తేదీన కమల ప్రసన్ననగర్ కాలనీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో జిమ్ కోచ్ జయకృష్ణ మంటల్లో కాలి మృతి చెందాడు. మొదటగా అందరూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. కానీ మృతుడి తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతైన విచారణ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్నాడని జయకృష్ణను అతడి భార్య దుర్గాభవాని తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేయించిందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడు చిన్నా, మృతుడి భార్య దుర్గా భవాని ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
ఇదీ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ..:ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన జయకృష్ణ(36) 20 ఏళ్ల క్రితం బతకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ జిమ్ కోచ్‌గా జీవనం సాగిస్తున్నాడు. దుర్గా భవాని అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యా పిల్లలతో కలిసి కమల ప్రసన్ననగర్‌లో గది అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. నగరంలో జిమ్ ట్రైనర్‌గా పని చేసే జయకృష్ణ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో హత్యకు వారం రోజుల ముందు హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని భార్యకు తెలిపాడు. అనంతరం జయకృష్ణ.. భార్యా పిల్లలను గ్రామంలో వదిలేసి.. తండ్రితో కలిసి నగరానికి వచ్చాడు. తండ్రి బంధువుల ఇంటికి వెళ్లగా.. జయకృష్ణ మాత్రం ఇంటికి చేరుకున్నాడు.