తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రోన్లతో నీటి జాడల గుర్తింపు.. అభివృద్ధి చేసిన ఎన్​జీఆర్​ఐ

భౌగోళిక అన్వేషణను సులభతరం చేసే కొత్త సాంకేతికతను జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) అభివృద్ధి చేసింది. భూ ఉపరితలం, భూమి లోపల పరిణామాలను, మార్పులను అధ్యయనం చేసేందుకు పూర్తి స్వదేశీ సాంకేతికతతో డ్రోన్ల ఆధారిత భూభౌతిక పరికరాలను రూపొందించింది. ఈ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి వస్తుందంటున్న ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.ఎం.తివారీతో 'ఈనాడు- ఈటీవీ భారత్​' ముఖాముఖి ...

New technology for geographical exploration
స్వదేశీ సాంకేతికతతో డ్రోన్లతో నీటి జాడలు తెలిసేలా అభివృద్ధి

By

Published : Oct 10, 2020, 12:37 PM IST

  • భూభౌతిక పరిశోధన రంగంలో సాంకేతికతను ఏ మేరకు వాడుతున్నారు?

భూగర్భంలో నీటి జాడలను కనుగొనడం నుంచి ఖనిజాలు, హైడ్రో కార్బన్లను, భూకంప కేంద్రాలను గుర్తించడం వరకు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాం. భౌగోళిక అన్వేషణకు అయస్కాంత సర్వేలు నిర్వహిస్తుంటాం. ఖనిజ నిక్షేపాల గుర్తింపు, నీటి జాడలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతాలకు మొదట్లో మనుషులు వెళ్లేవారు. కొద్ది సంత్సరాల కిందట హెలిక్టాపర్‌ వెనుక అయస్కాంత వ్యవస్థ ఏర్పాటుచేసి అన్వేషణ చేపట్టాం. ఇది ఖర్చుతో కూడుకున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ వ్యయంతో డ్రోన్‌- మానవ రహిత వైమానిక వాహనం(యూఏవీ)ను ఎన్‌జీఆర్‌ఐ అభివృద్ధి చేసింది. స్వదేశీ సాంకేతికతతో ఈ తరహా పద్ధతిని రూపొందించడం ఇదే మొట్టమొదటిది. హైదరాబాద్‌ శివారు యాచారంలో డ్రోన్‌ ఆధారంగా సూక్ష్మ అయస్కాంత సెన్సార్ల ద్వారా సర్వే చేసి కచ్చితమైన సమాచారం తెలుసుకోగలిగాం. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. వీటి ద్వారా కొండ ప్రాంతాలు, తీరప్రాంతాల్లోనూ సులభంగా భౌగోళిక మార్పులను తెలుసుకోవచ్చు.

  • భూకంపాల పరిశోధనలో ఆరు దశాబ్దాల్లో సాధించిన పురోగతి ఏంటి?

భూకంపాలపై ఇప్పటికీ మనకు తెలిసింది తక్కువే. ఏ ప్రాంతంలో రావొచ్చు, ఎంత తీవ్రతతో రావొచ్చు అనేది మాత్రమే చెప్పగలం.ఏ రోజు వస్తుందని చెప్పే సాంకేతికత ఇంకా రాలేదు. జీపీఎస్‌, కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ ప్రవేశంతో మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం.

  • దేశంలో నీటి వనరులు తగ్గిపోతున్నాయి కదా. మీ అన్వేషణలో గుర్తించిన అంశాలు, చేపట్టాల్సిన చర్యలు ఏమేమున్నాయి?

తగ్గుతున్న జలాలను కృత్రిమంగా రీఛార్జ్‌ చేయడం ఒక్కటే మనముందున్న అవకాశం. నీటిని కృత్రిమంగా ఎలా రీఛార్జ్‌ చేయాలో చౌటుప్పల్‌లో ఎన్‌జీఆర్‌ఐ చేసి చూపించింది. నీరు ఎక్కడ ఇంకుతుంది? ఎక్కడ రాళ్లు, రాళ్ల మధ్య పగుళ్లు ఉన్నాయి? ఎంతవరకు ఇంకించవచ్చు? ఈ విషయాలు తెలిస్తే వాన నీటిని ఇంకించడంతో ప్రయోజనం ఉంటుంది. వర్షం పడినప్పుడు ఎంతనీరు భూగర్భంలోకి ఇంకుతుందో తెలిస్తే దాన్ని బట్టి అక్కడ ఏ పంటలు వేయవచ్చనేది శాస్త్రీయంగా నిర్ణయించవచ్చు.

  • తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌జీఆర్‌ఐ చేస్తున్న పరిశోధనలు ఏంటి?

అణు విద్యుచ్ఛక్తి అవసరం ఉండటంతో సంబంధిత మంత్రిత్వ శాఖతో కలిసి.. ఆ ప్రాజెక్టులను ఎక్కడ ఏర్పాటుచేయాలి అనే పరిశోధనలో పాల్గొంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కొవ్వాడ వద్ద పనిచేస్తున్నాం. తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులూ లేవు. అమ్రాబాద్‌లో యురేనియం అన్వేషణ పనులు మేం చేయడం లేదు. మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఘండ్‌, ఒడిశాలో చేస్తున్నాం.

  • భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి?

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశంలోని వనరుల అన్వేషణకు అవసరమైన పరికరాలు, సాంకేతికత అభివృద్ధిపై దృష్టిపెట్టాం.

  • భూభౌతిక రంగంలో యువతకు ఎలాంటి అవకాశాలున్నాయి?

చాలా అవకాశాలే ఉన్నాయి. కొన్నేళ్ల కిందటే.. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రాంగణ నియామకాల్లో ఇంటిగ్రేటెడ్‌ జియోఫిజిక్స్‌ ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థికి అత్యధిక ప్యాకేజీ ఇచ్చారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. బొగ్గు, గ్యాస్‌, ఇంధన రంగాల్లో కూడా చాలా అవకాశాలున్నాయి. ఈ రంగంలో అంకుర సంస్థలు వస్తున్నాయి.

ఇదీ చదవండిఃజాగ్రత్తగా వాడుకుందాం.. విద్యుత్తు బిల్లు తగ్గించుకుందాం

ABOUT THE AUTHOR

...view details