తెలంగాణ

telangana

ETV Bharat / state

పనులు కరువై... బతుకు బరువై... - వలసకూలీల అవస్థలు

ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వచ్చి వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. తినడానికి తిండిలేక, తెచ్చుకున్న డబ్బులు అయిపోయి నానా అవస్థలు పడుతున్నారు. లాక్​డౌన్​ను రాష్ట్ర ప్రభుత్వం మరింత పొడిగించిన నేపథ్యంలో తమను తమ సొంతూళ్లకు పంపించాలని వేడుకుంటున్నారు.

latest news of migrants requested to the government that send them back to their homes
పనులు కరువై.. బతుకు బరువై..

By

Published : Apr 22, 2020, 6:58 AM IST

Updated : Apr 22, 2020, 9:05 AM IST

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వలస కూలీల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారమే 69,587. హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే పూర్వ ఖమ్మం జిల్లాలోనే వలస కూలీలు ఎక్కువ మంది ఉన్నారు. మిర్చి కోతలు, పారిశ్రామిక, అభివృద్ధి పనులు ఎక్కువ సంఖ్యలో జరుగుతుండటమే దీనికి కారణం. మిరప ఏరడానికి, జామాయిల్‌ కర్ర నరకడానికి సీజనల్‌గా కూలీలు వస్తుంటారు. రోడ్లు, రహదారులు, గ్రానైట్‌ పరిశ్రమ, కంకర మిషన్లు తదితర వాటిలో పని చేసేందుకు కొంత ఎక్కువకాలం ఉండేందుకు మరికొందరు వస్తుంటారు. వీరితో పాటు ప్రస్తుతం తెలంగాణలోని మిగతా జిల్లాలకు వలస వచ్చిన వారు కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు తరలి వస్తున్నారు.

పూర్వ ఖమ్మం జిల్లా మూడు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉండడం, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లేవారు ఇటువైపే వెళ్లాల్సి రావడమే కారణం. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన మెజారిటీ వలస కూలీలు సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడి నుంచి ఖమ్మం, వైరా, తల్లాడ మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు, కొత్తగూడెం, భద్రాచలం మీదుగా ఏపీలోని వీఆర్‌పురం, చింతూరు, అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుకుమా వెళ్తున్నారు. నాందేడ్‌, నాగ్‌పుర్‌, పుణె తదితర ప్రాంతాల నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు మిరప ఏరివేత పనుల కోసం వచ్చినవారు కూడా తమను స్వస్థలాలకు పంపాలని వేడుకుంటున్నారు.

వలస కూలీల ఇబ్బందులిలా..

* టార్పాలిన్‌తో వేసిన గుడారాల్లో ఉండలేకపోవడం

* ఎండ తీవ్రత పెరగడం, పనులు లేకపోవడంతో అవస్థలు

* మధ్యాహ్న సమయంలో చెట్ల కింద సేద తీరినా.. రాత్రివేళల్లో దోమల బెడద

* వ్యవసాయ క్షేత్రాల్లో నివాసం కారణంగా వర్షం వస్తే ఎటు వెళ్లాలో తెలియని దుస్థితి

* బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం

* వడదెబ్బకు గురవుతున్న వృద్ధులు, చిన్న పిల్లలు

* గుడారాలకు రేషన్‌ దుకాణాలు దూరంగా ఉండటం

* దాతల సహకారంతో కాలినడకను నమ్ముకోవడం

* మోకాళ్ల నొప్పులు, పాదాలు కందిపోవడం

* వివిధ అవసరాల నిమిత్తం గ్రామాల్లోకి వీరిని అనుమతించకపోవడం

అన్నం తినలేకపోతున్నాం..

‘అన్నం తినలేకపోతున్నాం. గోధుమ, జొన్న పిండితో కూడిన రొట్టెలు తినడం మాకు అలవాటు. దయచేసి మా బాధలను అర్ధం చేసుకోవాల’ని వలస కూలీలు కోరుతున్నారు. బియ్యం, నగదు ప్రభుత్వం ఇచ్చినా, పెరిగిన ధరల కారణంగా నిత్యావసరాలు కొనలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలు తమతో జొన్నపిండిని తెచ్చుకున్నారు. అది నిండుకుంది. వరి అన్నం అలవాటు లేకపోవడం వల్ల వారు అవస్థ పడుతున్నారు. కొందరు కూలీలు బియ్యాన్ని దుకాణాల్లో ఇచ్చి దానికి బదులుగా గోధుమ, జొన్న పిండి తీసుకువెళ్తున్నారు.

100 కి.మీ. నడిచి... ఉసూరుమంటూ మళ్లీ వెనక్కి...

ఎక్కడో ఛత్తీస్‌గఢ్‌ నుంచి సుమారు 67 మంది కూలీలు భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో మిరప కోతల కోసం వచ్చారు. స్వగ్రామాలకు వెళ్లిపోదామని వారు ఆదివారం బయలుదేరారు. తట్టాబుట్టా మోసుకొంటూ... పిల్లాపాపలను చంకనెత్తుకుని... దాదాపు 100 కి.మీ. నడిచి, మంగళవారం మణుగూరు చేరుకున్నారు. తీరా ఇక్కడికొచ్చాక పోలీసులు వారిని అడ్డుకున్నారు. మళ్లీ వాహనాలు ఎక్కించి జూలూరుపాడుకే వెళ్లమనడం వల్ల వారంతా భోరుమంటున్న దృశ్యమిది. ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఏఎస్పీ శభరీష్‌, తహసీల్దార్‌ నారాయణమూర్తి, సీఐ షుకూర్‌లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మంత్రితో ఎమ్మెల్యే కాంతారావు ఫోన్లో మాట్లాడి, కూలీల పెద్దతో మాట్లాడించారు. అనంతరం వారికి భోజనాలు పెట్టించి, ఒక వాహనంలో జూలూరుపాడుకు తరలించారు. సొంతూళ్లకు వెళ్లలేకపోతున్నామని, ఇంత దూరం నడిచి వచ్చినా, మళ్లీ వెనక్కే వెళ్లాల్సి వస్తోందని కూలీలు వెక్కివెక్కి ఏడ్చారు.

నడిచి వెళ్తూ బాలకార్మికురాలు మృతి

పన్నెండేళ్ల బాలకార్మికురాలు ఛత్తీస్‌గఢ్‌కు కాలినడకన వెళ్తూ మృతి చెందిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. ఆ బాలిక ఈ నెల 15న కన్నాయిగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్‌లో తన స్వస్థలమైన బీజాపూర్‌కు బయలుదేరింది. మూడు రోజుల పాటు 150 కిలో మీటర్లు నడిచింది. అన్నపానీయాలు లేకపోవడం వల్ల నీరసించి సొంతూరికి కొద్ది దూరంలో ప్రాణాలు విడిచింది.

సారూ.. మమ్మల్ని పంపించండి

నా పేరు శైలు. కుమురంభీం జిల్లా కౌటాల మండలం నుంచి మిరప చేలల్లో పనుల కోసం పిల్లల్ని ఇళ్ల వద్దనే వదిలేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి వచ్చాం. ఇక్కడ పనులు పూర్తయ్యాయి. దయచేసి మమ్మల్ని కౌటాల మండలానికి చేర్చాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆ మహిళ వేడుకుంది.

ఇదీ చదవండి:జాతీయ రహదారులపై అభివృద్ధి పనులు ప్రారంభం

Last Updated : Apr 22, 2020, 9:05 AM IST

ABOUT THE AUTHOR

...view details