హైదరాబాద్ నగరంలో రహదారులను కనిపెట్టి చూసేందుకు ఎన్ని రకాల కళ్లున్నాయో! వాటిల్లో దేని పనితనం దానిదే. అవి మామూలు కళ్లు కాదు... అత్యాధునిక కెమెరాలు. వాహనం ఎంత వేగంగా వెళ్లినా నంబరు ప్లేట్‌లోని వివరాలను దానంతటదే జూమ్ చేసుకొని చూడగలిగిన ఆటోమెటిక్ నంబరుప్లేట్ రికగ్నిషన్(ఏఎన్‌పీఆర్) కెమెరాల గురించి తెలిసిందే. అలాగే వాహనం ఎంత వేగంగా వెళ్తోందో చూపించేవి స్పీడ్ లేజర్ గన్‌లు. పీటీజడ్ కెమెరాలు 360 డిగ్రీల్లో తిరుగుతూ పరిశీలిస్తుంటాయి.
ఆర్నెళ్ల నుంచి అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)లోని కెమెరాలు శాంతి భద్రతల పోలీసులకు బాగా అక్కరకొస్తున్నాయి. న్యూయార్క్ పోలీసులు ఉపయోగిస్తున్న అధునాతనమైన ఈ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చినట్టు అదనపు సీపీ (ట్రాఫిక్) ఎస్.అనిల్‌కుమార్ తెలిపారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వీటిని 260 చోట్ల అమర్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించడం కోసం వీటిని ప్రవేశపెట్టగా దొంగలను.. నిందితులను కూడా పట్టిస్తున్నాయి. గత ఐదు నెలల్లో 60 కేసుల్లో ఇవి కీలకమైన ఆధారాలను అందించాయి.
ఆటోలో ప్రయాణికులు.. రూ.3 లక్షలు కొట్టేశారు..
కొత్తపేటలో ఉంటున్న విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి ఎం.విజయమోహన్‌రెడ్డి ఫిబ్రవరి 1న భార్యతో కలిసి రూ.3 లక్షల నగదుతో మలక్‌పేట రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కారు. ఆటోలో అప్పటికే కొందరు ప్రయాణికులున్నారు. ఇంటికి వెళ్లి చూసుకునేసరికి రూ.3 లక్షల నగదు కనిపించలేదు. మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయన ఎక్కిన ఆటో నంబరు టీఎస్11యూఏ0239 అని గుర్తించారు. డ్రైవర్‌ను.. అతడి ఆధారంగా నిందితులను పట్టుకుని రూ.3 లక్షలు బాధితుడికి ఇప్పించారు.
విలువైన పత్రాలు.. గంటల్లో ఇప్పించారు
ఔరంగాబాద్‌లో నివాసముంటున్న ముఖేష్ కుమార్ కల్యాణ్ స్నేహితులతో కలసి జనవరి 8న హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చారు. చార్మినార్‌లో వారంతా ఆటో ఎక్కారు. బిర్లామందిర్ వద్ద దిగారు. తర్వాత ముఖేష్ తన వస్తువులను చూసుకోగా.. చిన్న సంచి కనిపించలేదు. అందులో ఏటీఎం, ఆధార్, పాన్ కార్డులున్నాయి. ఆయన సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారు ప్రయాణించిన ఆటో నంబరు గుర్తించారు. అనంతరం డ్రైవర్‌కు ఫోన్ చేసి ముఖేష్ వస్తువులను తిరిగి ఇప్పించారు.