సింగరేణి ప్రాంతాల్లో ఈ సంవత్సరం 35.47 లక్షల మొక్కలను నాటనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హరితహారం, కేంద్ర ప్రభుత్వ వృక్షారోపన్ అభియాన్లో భాగంగా గురువారం ఒక్కరోజే సింగరేణి వ్యాప్తంగా సుమారు 2 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సింగరేణి భవన్లో మొక్కలు నాటి హరితహారం, వృక్షారోపన్ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ ఏడాది 804 హెక్టార్లలో మొక్కలు నాటుతున్నామని శ్రీధర్ పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 11 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. సింగరేణి సమీప గ్రామాల ప్రజలకు ఈ ఏడాది రెండున్నర లక్షల పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.