రాష్ట్రంలో తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతం కావడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అమలుకు మార్గం సుగమమైంది. 2018 మే నుంచి 21 తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. వాటిలో వ్యవసాయ భూములతో పాటు, ప్లాట్లు, ఇళ్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇలాంటిచోట్ల ప్రజలకు వ్యయ ప్రయాసలు.. చిక్కుముడులు తగ్గాయి.
తగ్గిన దూరాభారం
రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగైదు మండలాలకు ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చొప్పున ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం కనీసం 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఆస్తుల నమోదు ప్రక్రియ అంటే ప్రత్యేక ఏర్పాట్లే చేసుకోవాల్సి వచ్చేది. తహసీల్దార్ కార్యాలయంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టిన చోట్ల రెండు మూడు గంటల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు గరిష్ఠంగా 10 లోపే లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక మండల పరిధిలోనివే కావడం వల్ల తక్కువ సమయంలోనే పూర్తవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దారే మ్యుటేషన్ కూడా చేస్తుండడం వల్ల వెంటవెంటనే జరుగుతున్నాయి.
వివాదాస్పద భూములకు చెక్
తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రికార్డులన్నీ అందుబాటులో ఉండటం.. తహసీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులకు భూములపై అవగాహన ఉండటంతో వివాదాస్పద రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడింది. ప్రధానంగా ప్రభుత్వ భూములు, శిఖం భూముల అడ్డగోలు లావాదేవీలకు అవకాశం లేకుండాపోయింది. కార్యాలయాల్లో నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించటంతో పాటు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని కొందరు తహసీల్దార్లు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటిదాకా ‘మీ-సేవ’లో దరఖాస్తు చేసుకున్నాకే మ్యుటేషన్లు పూర్తి చేస్తున్నామని, కొత్త చట్టం వల్ల అది వెంటనే పూర్తవుతుందని చెప్పారు. పాస్ పుస్తకం కూడా నేరుగా అందుతుందన్నారు.
పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు
మొగుళ్లపల్లిలో మొదటి ఏడాది 178 రిజిస్ట్రేషన్లు జరగ్గా, రెండో ఏడాది 606, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 366 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంతర్గాంలో మొదటి ఏడాది 218 తర్వాత సంవత్సరం 403, తాజాగా 220 జరిగాయి. దేవరకద్రలో మొదటి ఏడాది 615, తర్వాత 2,995, తాజాగా 2,395 రిజిస్ట్రేషన్లు జరిగాయి.