రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖకు... వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అన్నింటిని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ చేసేట్లు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... ఆ దిశలో చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... మండల రెవెన్యూ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు నిర్వహించి ఆ వెంటనే మ్యుటేషన్ పూర్తి చేసేట్లు.. చర్యలు ముమ్మరమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు, రెవెన్యూ కార్యాలయాలకు.. నెట్‌వర్క్ అనుసంధానం చేసే కార్యక్రమం వేగవంతమైంది. రెండు శాఖల్లోనూ జరుగుతున్న సమూల మార్పులు.. చేర్పులతో పూర్తి పారదర్శకత వస్తుందని.. అవినీతికి అస్కారం లేని సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఇప్పటివరకు సబ్ రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలకు కత్తెర వేసే దిశలో కూడా చర్యలు మొదలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెక్షన్ 47 సబ్ సెక్షన్ ఏని... పూర్తిగా రద్దు చేయడం ద్వారా సబ్‌రిజిస్ట్రార్లకు ఉన్న విచక్షణాధికారాలు తొలగిపోయి.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
క్రయవిక్రయదారులే నేరుగా..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే స్కాన్డ్ కాపీని ఇస్తారు. ఇందుకు ప్రస్తుతం 24 గంటల సమయం తీసుకుంటున్నారు. ఇది కూడా అవినీతికి ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. స్కాన్డ్ కాపీ కోసం మళ్లీ వెళ్లడం, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్చించారు. దీంతో స్కానింగ్ కోసం కూడా 24 గంటల పాటు ఆగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన వెంటనే స్కానింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అవసరమైతే మల్టీనేషనల్ కంపెనీలకు టెండర్ ద్వారా స్కానింగ్ బాధ్యతను అప్పగించి ఆ వెంటనే స్కాన్డ్ కాపీని అందించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్ రైటర్లపై ఆధారకుండా క్రయవిక్రయదారులు నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా కూడా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం అవసరమైన నమూనా పత్రాలను ప్రభుత్వమే సిద్ధం చేస్తోంది. కేవలం పేర్లు, వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ను సిద్ధం చేసుకునేలా నమూనా పత్రాలను సిద్ధం చేస్తున్నారు.