Land Mafia in Telangana : ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించే విలువైన ప్రకృతి వనరులు ఇసుక, మట్టి. అలాంటి విలువైన ప్రకృతి వనరులు ఉమ్మడి మెదక్ జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో ఈ అక్రమాలు అడ్డే లేదన్నట్లు సాగుతున్నాయి. నిబంధనల ప్రకారం వీటి తవ్వకాల కోసం మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. నిర్దేశించిన రుసుము చెల్లించాలి. ఇవేవి లేకుండానే అక్రమార్కులు దర్జాగా తమ దందాను సాగిస్తున్నారు.
ఎక్కడ కనిపిస్తే అక్కడ అనుమతి లేకుండా తవ్వేస్తూ మట్టి, ఇసుక బకాసురులు వాటిని తరలించుకుపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఈ దందా వీపరీతంగా జరుగుతోంది. సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్ పేట, హనుమాన్‌నగర్, గుడితండా, గౌడిచర్ల తదితర గ్రామాల్లో స్థానికంగా ఉన్న కొందరు నాయకులు భారీగా మట్టి వ్యాపారం (Illegal Sand Business) చేస్తున్నారు. కంది మండలం బ్యాతోల్‌లోనూ ఇదే పరిస్థితి. అసైన్డ్ భూముల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టి సేకరించిన మట్టిని గ్రామ శివారుల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి విక్రయాలు చేపడుతున్నారు. సదాశివపేట మండలం రేజింతల్, ఆత్మకూర్, మద్దికుంట, వెల్డూర్, ఆరూర్ వంటి గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
illegal sand mining: మహబూబ్‌నగర్‌లో అక్రమంగా ఇసుక మాఫియా
సంగారెడ్డిలోని నక్కవాగు పరివాహక ప్రాంతం మెుత్తాన్ని అక్రమార్కులు తవ్వేశారు. వాగు పూర్తిగా కనుమరుగై పోయింది.మట్టి బకాసురులు తవ్వకాలు జరిపేందుకు వీలుగా వాగును మార్చేసుకున్నారు. ప్రభుత్వ భూమి కావడం, పట్టించుకునే నాథుడు లేకపోవడంతో దాదాపు 8 నుంచి 10 అడుగులలోతు వరకు మట్టిని తవ్వేస్తున్నారు. ప్రొక్లయిన్ల సాయంతో భారీగా గోతులు తీస్తూ మట్టిని కొల్లగొడుతున్నారు. మీడియాలో దందా గురించి వార్తలు వచ్చినప్పుడు మాత్రం పని ఆపేసి మళ్లీ యథాతథంగా కొనసాగిస్తున్నారు. వీరికి ప్రజా ప్రతినిధులు అండగా నిలుస్తుండటంతో అక్రమార్కులు మరింత ధైర్యంగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు. మట్టిని ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తూ ఇళ్లు కట్టడానికి ఉపయోగించే ఇసుకగా తయారు చేస్తున్నారు. సహజంగా నదుల్లో దొరికే తెల్ల ఇసుగా మట్టిని మారుస్తూ విక్రయిస్తున్నారు. .
Illegal Sand Mining in Telangana : ఆందోల్ నియోజకవర్గంలోని ఆందోలు, వట్‌పల్లి, పుల్‌కల్ ప్రాంతాల్లోనూ జోరుగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. స్థానిక కుంటలు, చెరులు, పడావు స్థలాలే లక్ష్యంగా అక్రమార్కులు మట్టిని కొల్లగొడుతున్నారు. మాసాని పల్లి, ఆల్మాయిపేట్, చందంపేట శివారులోని ప్రభుత్వ భూములు, కన్‌సానిపల్లిలోని చెరువుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారులు ఏర్పాటు చేస్తున్న వెంచర్లు, నిర్మాణాల కోసం భారీగా మట్టిని తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకున్నా అధికారులు ఇటు వైపు మాత్రం చూడటంలేదు. చెరువు చుట్టు పక్కల భారీగా గోతులు ఏర్పడటంతో స్థానికంగా ఉన్న రైతులు ఆందోళ చెందుతున్నారు. వెంచర్ల ఏర్పాటుకు చదును చేయడానికి ప్రభుత్వ భూముల్లోని మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. అదే విధంగా ట్రాక్టర్ మట్టిని వెయ్యి రూపాయల నుంచి రూ.1200ల వరకు అమ్ముకుంటున్నారు. తరలించే దూరాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు.
Sand Mafia: ఇసుక మాఫియా దౌర్జన్యం.. అడ్డుకున్న అధికారులను నెట్టేసి మరీ..!