- జూబ్లీహిల్స్‌లో రూ.100-120 కోట్ల విలువైన స్థలం దశాబ్దాలుగా ఖాళీగా ఉంటోంది. సంపన్నులు నివసించే ఆ ప్రాంతంలో సొంతిల్లు కట్టుకోవాలని ఓ ప్రజాప్రతినిధి ఆశపడ్డాడు. మరో ఇద్దరు బడానేతలూ కన్నేశారు. ముగ్గురి మధ్య వివాదం నడుస్తోంది. ఈలోగా రెవెన్యూలో తనకు అనుకూలమైన అధికారితో ఆ భూమి పత్రాలు సిద్ధం చేసేందుకు వారిలో నాయకుడు సిద్ధమయ్యారు.
- యూసుఫ్‌గూడలో వివాదంలో ఉన్న భూమి విలువ రూ.100 కోట్ల పైమాటే. ఓ పార్టీకి చెందిన నాయకుడి అనుచరుడు రంగంలోకి దిగాడు. ఆ స్థల యజమానితో మంతనాలు సాగించాడు. తాము నిర్ణయించిన ధరకే స్థలం ఇవ్వాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిక చేశాడు. ఆ స్థలం దక్కించుకొని నిర్మాణాలు చేపట్టారు. వీటికి తోడు తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నం.14లో ఓ వివాదాస్పద స్థలం విషయంలో తలదూర్చిన ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, ఎస్సై రవీంద్రనాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట్ రెవెన్యూ మండలంలో భూ అక్రమాలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. కోట్లాది రూపాయల ధర పలుకుతున్న స్థల వివాదాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. జిల్లాలోని మారేడుపల్లి, ఖైరతాబాద్, షేక్‌పేట్, ముషీరాబాద్, బండ్లగూడ, నాంపల్లి తదితర రెవెన్యూ మండలాల్లో తరచూ ఇటువంటి భూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. భూ హక్కుదారులకు నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇచ్చేందుకూ తిప్పించుకుంటున్నారు.
నలువైపులా ఇదే వరుస
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూ వివాదాలు తారస్థాయికి చేరాయి. కొన్ని పోలీస్‌స్టేషన్లు, తహసీల్దారు కార్యాలయాల కేంద్రంగా యథేచ్ఛగా భూలావాదేవీలు సాగుతున్నాయి. ఉప్పల్ మండలంలో పేదలకు పంపిణీ చేసిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఇదే మండలంలో ఓ విశ్రాంత శాస్త్రవేత్త స్థలాన్ని కొందరు రౌడీషీటర్లు కబ్జా చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమకూ వాటా కావాలన్నారు. బాధితుడు పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయటంతో ఓ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. 2018లో నిజాంపేటలోకి ఖాళీ స్థలాల అంశంలో రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఓ ఆర్‌ఐ పట్టుబడ్డారు. 2019లో మేడ్చల్ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న ఓ వీఆర్‌ఓను కలెక్టర్ సస్పెండ్ చేశారు.