Bonalu: ఆషాఢ మాసం చివరి ఆదివారం భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా సింహవాహిని అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. వర్షాలు తగ్గాలని పూజలు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మంత్రులు తలసాని, మహమూద్ అలీ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అట్టహసంగా నిర్వహించామని మంత్రి తలసాని తెలిపారు. అమ్మవారి దీవెనలు ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు
కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, వీహెచ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కుల, మత బేధాల్లేకుండా అందరూ బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం... హైదరాబాద్ గొప్పతనమని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. లాల్‌దర్వాజ ఆలయంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనం ఎత్తుకుని వచ్చి సమర్పించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు... లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
గోషామహల్‌లోని బేగంబజార్ హిందీనగర్‌లో నిర్వహించిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఏడు గుళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పోతురాజులతో కలసి నృత్యాలు చేసి సందడి చేశారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకాంక్షించారు. బోరబండ పోచమ్మ ఆలయంలో పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు.