ఈ యువతి పేరు బబితా దాస్ గుప్తా. వీరి కుటుంబం 30 ఏళ్ల కిందటే కోల్‌కతా నుంచి ఏపీలోని విశాఖకు వలస వచ్చింది. వీరి తండ్రి పూర్ణామార్కెట్‌లో గృహోపకరణాల మరమ్మతులు చేసేవారు. కుటుంబాన్ని ఏ లోటూ లేకుండా చూసుకునేవారు. పదేళ్ల కిందట గుండెపోటుతో ఆయన హఠాన్మరణం.. ఆ కుటుంబాన్ని కష్టాల్లో పడేసింది. భార్య బిందూదాస్‌గుప్తా, కుమార్తెలు బబితా, కాజల్, బంటీ దిక్కులేనివారయ్యారు. అలాంటి పరిస్థితుల్లో.. కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది పెద్ద కుమార్తె బబితా. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి.. తన తండ్రి వృత్తిని కొనసాగిస్తూ.. గృహోపకరణాల మరమ్మతులు చేపట్టింది.
మరమ్మతులపై అవగాహన లేని బబిత.. మొదట్లో చాలా కష్టాలు ఎదుర్కొంది. బంధువులెవరూ ఆమెకు సాయపడలేదు. ఇతరుల సాయంతో ఆ పనిపై పట్టు సాధించింది. ఈ క్రమంలో ఎన్నో గాయాలయ్యాయి. చాలాసార్లు విద్యుత్ షాక్‌కు గురైంది. అన్నింటినీ తట్టుకుని కుటంబం కోసం నిలబడింది. తల్లిని కాపాడుకుంటూనే చెల్లెళ్లను చదివించింది. వారు ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు.