Lack of facilities in lingampet Government School: జగిత్యాల జిల్లాలోని లింగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఆంగ్ల మాధ్యమంలో సాగుతున్న ఈ బడి.. ప్రైవేట్‌కి దీటుగా ఉంది. 12 ఏళ్లుగా పది ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తోంది. ఈ పాఠశాలకు దాతలు తమవంతుగా సహకారం అందిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు తిరుమల్ వద్ద చదివిన పూర్వ విద్యార్థులు, స్థానికుల ద్వారా విరాళాలు సేకరించారు. 70 సైకిళ్ళతోపాటు కంప్యూటర్ ల్యాబ్, డెస్క్‌లు, కుర్చీలు వంటివాటిని దాతలు అందించారు.
అయితే ప్రభుత్వం అండగా నిలవకపోవడంతో సమస్యలు తప్పడం లేదు. స్కూల్‌లో కేవలం రెండు గదులు మాత్రమే ఉండగా ఒకదాన్ని కంప్యూటర్ ల్యాబ్‌కు కేటాయించారు. ఇంకో గదితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. కొందరు విద్యార్థులు మెట్ల కింద చదువుకుంటుంటే మరికొందరు చెట్ల కిందే పాఠాలు వింటున్నారు.
ప్రహరీగోడ లేకపోవటంతో పక్కనే రహదారి నుంచి ఏ వాహనం ఎప్పుడు దూసుకోస్తుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం 'మన ఊరు మనబడి' కార్యక్రమం కింద గదుల నిర్మాణం చేపట్టి ప్రహరీ గోడ నిర్మిస్తే మరింత మంది విద్యార్థులకు బడిలో చేరే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.