ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా రోగులను క్వారంటైన్‌కు తరలించే విషయంలో.. అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. కరోనా సోకిన వారు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్లో అర్ధరాత్రి వరకు.. ఆకలితో రోడ్డుపై నిలుచోవాల్సి వచ్చింది. జిల్లాలోని ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో.. తాడేపల్లిగూడెంలో పట్టణ పేదలకు నిర్మించిన గృహ సముదాయంలో జిల్లాస్థాయి క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వందల సంఖ్యలో కేసులు వస్తుండడంతో ఏలూరు సెంటర్ పూర్తిగా నిండి పోయింది. తాడేపల్లిగూడెం కేంద్రంపై ఒత్తిడి పెరిగింది.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ ఏర్పాట్లు చేసిన మేరకు గదులు నిండిపోయాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి గదులు కేటాయింపులో బాగా ఆలస్యం జరిగింది. దీంతో కొవిడ్ బాధితులు రోడ్లపైనే పడిగాపులు కాశారు. సాయంత్రానికి అక్కడకు చేరుకున్న వారికి.. అర్ధరాత్రి వరకు కూడా గదులు ఇవ్వలేదు.