KURMA VILLAGE PEPOLE LIFE STYLE : కాలం మారుతున్న కొద్దీ అలవాట్లూ, పద్ధతులూ మారుతూ ఉంటాయి. కాలం మనుషులను అలా ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. అది కాలం లక్షణం. అయితే కాలానికి ఎదురునిలుస్తూ.. పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి చెందిన ప్రజలు. ఇప్పటికీ ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తున్న గ్రామంగా కూర్మ గుర్తింపు పొందింది. ప్రాచీన భారతీయ గ్రామీణ ప్రజల పద్ధతులు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దంలా ఉంది.
ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కుర్మా గ్రామం: 200 ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు, వృత్తులు, వీటన్నిటిని ఒకే చోట కలపోస్తే కూర్మ గ్రామం. ఈ గ్రామాన్ని 2018 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఏర్పాటు చేశారు.. మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో... ప్రస్తుతం 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులతో కలిపి మొత్తం 56 మంది నివసిస్తున్నారు, బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కుర్మా గ్రామం ప్రజలు సంకల్పించుకొని ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అందరికీ ఆదర్శంగా కూర్మ గ్రామం: ఆధునిక కాలంలో మానవుడు యంత్రంలాగా పనిచేస్తూ తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమై నిలుస్తోంది. ప్రకృతిసిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కూర్మ గ్రామంలో ఉన్న వారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే.
అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్న ఇతర దేశాల ప్రజలు:ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పని చేసినవారే. కానీ యాంత్రిక జీవితానికి విసుగుచెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్ని వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో, పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని ఈ గ్రామస్థులు అంటారు. తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తున్నారు.
"ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు తాత్కాలికమైనవి. జీవితంలో ప్రతిక్షణం పరుగెత్తాల్సి వస్తోంది. మనుషులకు డబ్బుపై ధ్యాస పెరిగింది. కూర్చుని తినడానికి కూడా సమయం ఉండడం లేదు. మన తండ్రి, తాతల జీవితాన్ని పరిశీలిస్తే వారు చాలా ఆనందంగా బతికారు. వారి జీవితాన్ని పరిశీలిస్తే మనం ఎలా బతుకుతున్నామో తెలుస్తుంది" నుహారి, రష్యా నుంచి వచ్చిన వ్యక్తి