ఎన్నో ఆశలతో వచ్చి కాంట్రవర్శియల్ అయిన వెబ్ సిరీస్ రానా నాయుడు. దీనిని ఒటీటీ నుంచి తీసేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. అసభ్య పదజాలం, బోల్డ్ కంటెంట్ ఉన్న రానా నాయుడు, మీర్జాపుర్ లాంటి సినిమాలను ఓటీటీల నుంచి తీసేయాలని.. వెబ్ సిరీస్ కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి రావాలని కూనంనేని సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఓటీటీ ప్లాట్ ఫామ్లో ప్రసారమవుతున్న రానా నాయుడు, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్ ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలుగు ప్రజలకు మంచి కుటుంబ కథా చిత్రాలు అందించిన దగ్గుబాటి రామా నాయుడు కుటుంబ సభ్యుల నుంచి రానా నాయుడు వంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరమన్నారు. అందులో అశ్లీల డైలాగులను దగ్గుబాటు వెంకటేశ్, రానా మాట్లాడడం కుటుంబ మర్యాద భంగం కలిగేలా ఉందని వ్యాఖ్యానించారు. ఓటీటీలపై నియంత్రణ, సెన్సార్ షిప్ లేకపోవడంతో అశ్లీల సన్నివేశాలు, డైలాగులు విశృంఖలంగా ప్రసారం చేస్తున్నారని, దీంతో యువత పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉండడంతో ఓటీటీల ద్వారా వెబ్ సిరీస్ మారుమూల పల్లెల్లో సైతం సులువుగా వీక్షించేందుకు సౌలభ్యం కలిగిందని, దీంతో విష సంస్కృతి కింది వరకు వేగంగా పాకిపోతున్నదన్నారు. ఇది మంచిది కాదని, తక్షణమే వెబ్ సిరీస్ కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా రానా నాయుడు వెబ్ సిరీస్ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.