Kunamneni Comments on BRS Party: ఎన్నికలకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్తో ఏమీ మాట్లాడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. బీజేపీకు వ్యతిరేకంగా మునుగోడులో బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పటికీ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. పొత్తులు పొత్తులే.. పోరాటం పోరాటమే అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎవరూ అధికారంలోకి రావాలని నిర్ణయించేది కమ్యూనిస్టులేనని కూనంనేని అన్నారు. టికెట్లు ఒకరు మాకు ఇచ్చేది ఏంటని ప్రశ్నించారు. తమ అవసరం ఉందనుకుంటే తమ దగ్గరకే బీఆర్ఎస్ వస్తుందన్నారు. అవసరం లేదనుకుంటే ఎవరి దారి వారిదేనని పేర్కొన్నారు. ఏఐటీయుసీ ధర్నా చేస్తుంటే రేవంత్రెడ్డి పాదయాత్ర అక్కడికి వచ్చిందని, అంతే తప్పితే ఏఐటీయుసీ కావాలని పాదయాత్రలో పాల్గొనలేదన్నారు.
Kunamneni Comments on BRS: సీపీఎం, సీపీఐ కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకుగాను సీపీఎం, సీపీఐ కలిసి భారీ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అదానీ కుంభకోణంపై ఒక్కసారి కూడా నోరు విప్ప లేదని మండిపడ్డారు. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో అదానీ స్కామ్ బయటపడిందని ఆయన వివరించారు. జేపీసీ వేయమన్నా మోదీ ఎందుకు వేయడం లేదని కూనంనేని ప్రశ్నించారు.
విద్యుత్ ఛార్జీల పెంపుతో.. సామాన్య ప్రజలపై భారం:సీపీఐ పోరాటం వల్లే పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం స్పందించిందని కూనంనేని స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కరెంట్ లేకపోవడం వల్ల రైతుల పంటలు ఎండిపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కూనంనేని కోరారు.
ఇవీ చదవండి :