కూకట్‌పల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన మైలా సతీష్ కుమార్ మూసాపేటలోని ఆంజనేయ నగర్లో నివాసం ఉంటున్నాడు. కేపీహెచ్పీలో ఐటి స్లేట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. సతీష్‌కు కోరుకొండ సైనిక స్కూలులో చదువుతున్న సమయంలో భీమవరానికి చెందిన హేమంత్‌తో స్నేహం ఏర్పడింది. సతీష్ కంపెనీ ఏర్పాటు చేసిన తరువాత తన చిన్ననాటి స్నేహితుడు హేమంత్‌కు ఉద్యోగం ఇవ్వటమే కాకుండా వ్యాపారంలో భాగస్వామిగా చేసుకున్నాడు.
కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆర్థిక పరమైన విషయాల్లో మనస్పర్థలు ఉన్నట్లుగా మృతుని స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఇంటి నుంచి ఆఫీసుకి వెళ్ళిన సతీష్ ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి తిరిగివస్తున్నానని చెప్పాడు. ఇంటికి తిరిగిరాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అతడి భార్య ప్రశాంతి 29వ తేదీన కేపీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.