కూచిపూడి నాట్యంలో రాణిస్తున్న హైదరాబాదీ అమ్మాయి కొత్తదనానికి మారుపేరు యువతరం... సంప్రదాయ కళలన్నా అంతే ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకు ఉదాహరణే కూచిపూడి కళాకారిణి వైష్ణవి. నాట్యంతో కళాభిమానుల్ని అలరిస్తోన్న ఈ అమ్మాయి 11ఏళ్లుగా కూచిపూడిలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ చూపుతోంది.
రెండున్నర గంటల్లో 8 పాటలకు నర్తించి
హైదరాబాద్ గాంధీనగర్‌లో నివసిస్తున్న భారతీ, సురేష్ దంపతుల పెద్ద కుమార్తె వైష్ణవి. ఆచార్య సుధాకర్, డాక్టర్ రత్నశ్రీ ఆధ్వర్యంలో కూచిపూడిలో శిక్షణ పొందిన వైష్ణవి.. సాధన మెుదలుపెట్టిన మూడేళ్లకు... రవీంద్రభారతి వేదికగా 9వ ఏట కూచిపూడి అరంగేట్రం చేసింది. తొలి ప్రదర్శనలోనే రెండున్నర గంటల్లో 8 పాటలకు నర్తించి ఆశ్చర్యపోయేలా చేసింది.
కళాతపస్వి విశ్వనాధ్‌ను మెప్పించింది
అరంగేట్రం ప్రదర్శనతోనే కళాతపస్వి కె.విశ్వనాధ్‌ను మెప్పించింది వైష్ణవి. తర్వాత మరెంతో మంది ప్రముఖుల ప్రశంసలందుకుంది. మండోదరి శపథం, శివాష్టకం, అఠానా జతీస్వరం, వసంత జతీశ్వరం, ఆద్యాత్మ రామాయణ కీర్త, దశావతారాలు, భామా కలాపం, మధుర మధుర కీర్తీన ఇలా 15కుపైగా ప్రదర్శనల్ని తనదైన అభినయంతో జనరంజకంగా మలుస్తుంది....వైష్ణవి.
సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు
తెలుగురాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ ఇప్పటి వరకు వైష్ణవి 200కుపైగానే ప్రదర్శనలిచ్చింది. తితిదే నాదనీరాజనం సహా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంది. ప్రపంచ తెలుగుమహాసభల్లోనూ ప్రదర్శనతో ప్రశంసలందుకుంది. గోదావరి పుష్కరాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అనేక వర్సిటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చింది.
చెన్నైలో నిర్వహించిన నృత్యప్రదర్శన పోటీల్లో 200 మంది నృత్యకారులతో పోటీపడి మొదటి స్థానంలో నిలిచింది...వైష్ణవి. ప్రసార భారతి నిర్వహించిన అందెల రవళి కార్యక్రమ విజేతగా ఆకట్టుకుంది. ఏలూరు నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటింది.
సాధన అంగీకం, అభినయం కీలకం
కూచిపూడిలో ప్రత్యేకత గుర్తింపుపై సంతోషం వ్యక్తం చేస్తున్న వైష్ణవి...ఈ నృత్యంలో ఉత్తమంగా రాణించాలంటే నిశిత పరిశీలన, సాధన అంగీకం, అభినయం కీలకమంటోంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా ...తట్టుకొని నిలబడగలిగే మానసిక స్థైర్యం నాట్యం ఇస్తుందని స్పష్టం చేస్తోంది.
వచ్చే నగదును నిరుపేదల కోసం దానం
కళాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ప్రదర్శనలిస్తున్న వైష్ణవి ప్రతిభ చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రదర్శనల ద్వారా వచ్చే నగదును నిరుపేదల కోసం దానం చేయడం మరింత ఆనందం ఇస్తుందంటున్నారు.
ప్రస్తుతం కూచిపూడిలో డిప్లమో చేస్తున్న వైష్ణవి.. పేద విద్యార్థుల కోసం ఉచితంగా అకాడమీ ప్రారంభించటమే లక్ష్యంగా పెట్టుకుంది. కూచిపూడి నృత్యానికి సమకాలీన అంశాలను మేళవిస్తూ ప్రజలను ఆలోచింపజేయాలని, అందరికి చేరువ చేయాలని నిర్ణయించుకుంది.