KTR Inspected Steel Bridge Works In Hyderabad: సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరా పార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనుల పురోగతిని జీహెచ్ఎంసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం స్టీల్బ్రిడ్జి నిర్మాణంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ స్టీల్బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపులు వంటి అంశాల విషయంలో నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసి.. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని ఆదేశించారు.
ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరిగా స్టీల్బ్రిడ్జి అద్భుత నిర్మాణం: నిర్మాణ పనులను పరిశీలించుకుంటూ మంత్రి కేటీఆర్ వీఎస్టీ చేరుకున్నారు. అక్కడ దాదాపు పూర్తయిన ర్యాంపు పైనుంచి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే నగరంలో పూర్తయిన ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరిగా.. ఈ స్టీల్బ్రిడ్జి సైతం అద్భుతమైన నిర్మాణంగా మారబోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్బ్రిడ్జి కోసం జీహెచ్ఎంసీ దాదాపు రూ.440 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.