KTR about Urban parks : ప్రకృతి ఒడిలో గడిపేందుకు రాష్ట్రంలోని అర్బన్ పార్కులు అద్భుతమైన ప్రదేశాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అర్బన్ పార్కుల్లో పలు సౌకర్యాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. వాకింగ్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, సైక్లింగ్ లాంటి వాటితో సరదాగా గడపవచ్చునని మంత్రి ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా అర్బన్ పార్కుల సమాచారం తెలుసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు.
హరితహారానికి ప్రాధాన్యం
రాష్ట్రంలో పచ్చదనం పెంపు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. హరితహారంతో పాటు పట్టణాలు, గ్రామాల్లో గ్రీన్ బడ్జెట్ను చట్టంలోనే పొందుపరచడం సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హరిత తెలంగాణే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఏడు విడతలుగా మొక్కలను నాటింది. కేవలం నాటడానికే పరిమితం కాకుండా... వాటిని సంరంక్షించే బాధ్యతనూ అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో అటవీ శాతం పెరుగుతోంది.
రెండో స్థానంలో తెలంగాణ
Forest Area In Telangana: దేశంలో గత రెండేళ్లుగా అటవీవిస్తీర్ణం, సంబంధించిన అంశాలపై కేంద్ర అటవీశాఖ ఇటీవల రూపొందించిన నివేదికలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా 647 చదరపు కిలోమీటర్లు పెరగగా... 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 2019 నివేదిక ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 20,582 చదరపు కిలోమీటర్లు కాగా 2021 నివేదిక ప్రకారం ఆ మొత్తం 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.