KTR Tweet: కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్‌కు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. కలెక్టర్‌తో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరు తనను భయపెట్టిందని అన్నారు. భాజపా నాయకుల ప్రవర్తనతో ఐఏఎస్ అధికారులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కలెక్టర్ గౌరవప్రదమైన ప్రవర్తనకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. కష్టపడి పనిచేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ఇలాంటి రాజకీయ నేతలు నిరుత్సాహపరుస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ కేంద్రమంత్రిపై విమర్శలు గుప్పించారు.
మరోవైపు అన్ని భాజపా పాలిత రాష్ట్రాల్లోని రేషన్ దుకాణాల్లో తెలంగాణకు ధన్యవాదాలు అని బ్యానర్లు పెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ సూచించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తోందని కేంద్ర మంత్రి ప్రసంగాలు ఇస్తున్నారన్న ఆయన.. వాస్తవాలను అందరి ముందు ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ దేశానికి రూపాయి ఇస్తోంటే.. రాష్ట్రానికి తిరిగి కేవలం 46 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను ట్విటర్లో జతపరిచారు.
అసలేం జరిగిందంటే.. పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో పర్యటించారు. ఈ క్రమంలనే బీర్కూర్‌లో రేషన్ దుకాణాన్ని సందర్శించారు. ప్రజలకు ఇస్తున్న రేషన్ వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు. పేదలకిచ్చే బియ్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో చెప్పాలని లబ్ధిదారుల ముందే నిలదీశారు. కేంద్ర, రాష్ట్ర వాటాలు ఎంతో చెప్పాలంటూ లబ్ధిదారుల ముందు కలెక్టర్‌ను నిలదీశారు. పాలనాధికారి సమాధానం చెప్పకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30 రూపాయలు ఇస్తుంటే.. రాష్ట్రం కేవలం రూ.5 ఖర్చు చేస్తుందని నిర్మల అన్నారు. ప్రజలకు అసలు విషయం చెప్పాలనే పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ దుకాణం వద్ద పెట్టిన ఫ్లెక్సీలో ప్రధాని ఫొటో లేకపోవడంపై కలెక్టర్‌ను ప్రశ్నించారు. మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. మరోసారి వచ్చేసరికి ప్రధాని ఫొటో ఉండాలని నిర్మలా సీతారామన్ ఆదేశించారు.