KTR Tweet On Karnataka Election Result : కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవని పురపాలక శాఖా మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ట్విటర్‌లో కేటీఆర్ స్పందించారు. కర్ణాటక ప్రజలపై ప్రభావం చూపడంలో 'ది కేరళ స్టోరీ' ఎలా విఫలమైందో అదే విధంగా కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోవని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపారు.
బీజేపీని కర్ణాటక నుంచి తరిమికొట్టి నీచమైన, విభజన రాజకీయాలను కన్నడ ప్రజలు తిరస్కరించారని వారికి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. భారతదేశం మంచి కోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు హైదరాబాద్, బెంగళూరు ఆరోగ్యంగా పోటీ పడాలని ఆకాంక్షించారు. కర్ణాటకలో ఏర్పడనున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.
కర్ణాటక తీర్పుతో బీజేపీ నుంచి దక్షిణ భారతానికి విముక్తి: దక్షిణాది నుంచి బీజేపీ పతనం ప్రారంభమైందని, అన్ని చోట్లా ఆ పార్టీ ఖాతా ముగుస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. కర్ణాటక తీర్పుతో బీజేపీ నుంచి దక్షిణ భారతదేశానికి విముక్తి లభించిందని.. ఈ చరిత్రనే కొనసాగుతుందని మంత్రి హరీశ్ రావు ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. కర్ణాటకలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.