KTR Tweet Parliament Elections 2024 : నాడు నేడు ఏనాడైనా తెలంగాణ గళం, బలం, దళం తామేనని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ జట్టుకు మాత్రమే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో పోస్టు పెట్టారు.
16, 17వ లోక్‌సభల్లో బీఆర్‌ఎస్ ఎంపీలు 4754 ప్రశ్నలు అడిగారని కేటీఆర్ తెలిపారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు 1271, బీజేపీ ఎంపీలు 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని ఎక్స్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేసేది బీఆర్‌ఎస్(BRS) ఎంపీలు మాత్రమేనని తేల్చి చెప్పారు. 2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) అన్నారు. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక తమ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.
BRS Focus on Parliament Elections 2024 :మరోవైపు భారత్ రాష్ట్ర సమితి లోక్ సభ సన్నాహక సమావేశాలు రెండో దఫా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ సన్నాహక సమావేశం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ నేతలు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మధుసూధనాచారి వారితో సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికల ఓటమిపై సమీక్షతో పాటు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ - ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ట్వీట్