KTR Tweet on Water Day in Decade Celebrations : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడ పండగ వాతావరణంలో నిర్వహించుకున్నారు. మండువేసవిలోనూ పంట కాల్వల్లో నీరు పారుతున్నాయంటే కేసీఆర్ సాగు దార్శనికతకు నిదర్శమని గులాబీ నేతలు కొనియాడారు. తొమ్మిదేళ్లలో కాళేశ్వరం సాకారం సహా సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను వివిధ కార్యక్రమాల ద్వారా చాటిచెప్పారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు సాగునీటి రంగంలో తమ సర్కార్ చేపట్టిన పలు విశేషాలను ట్విటర్‌లో పంచుకున్నారు.
సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చాం : తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దిన ఘనత... ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అనిమంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలు ప్రాజెక్టుల విశేషాలను మంత్రి ట్విటర్‌లో పంచుకున్నారు. చుక్క నీటి కోసం అలమటించిన రోజుల నుంచి... తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకురాగలిగామన్నారు. తెలంగాణ జల విధానం.... దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో రైతులు సంక్షోభం ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.కేసీఆర్ నిబద్ధతతో తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం వచ్చిందన్న మంత్రి.. చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ప్రతినిత్యం జలాభిషేకం చేస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే వందేళ్ల వరకు ప్రజలకు సాగు నీటి కొరతను తీర్చిందన్న మంత్రి... త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్న నీటి పారుదల రంగానికీ కేసీఆర్ సర్కారు పెద్దపీట వేసిందన్న కేటీఆర్.... ఈ విషయంలో భాగస్వాములైన ఇంజినీర్లకు, శ్రామికులకు, నీటి పారుదల శాఖ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.